- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రైతులు బాగుపడుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ వీరాభిమాని అయిన మహారాష్ట్రలోని షిరిడీకి చెందిన సదాశివ లేఖర్ జగ్గారెడ్డికి ఎదురుపడడంతో ఆయనతో ఆసక్తిగా మాట్లాడారు. ఒంటినిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో పార్టీ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేని సదాశివ లేఖర్ అభిమానాన్ని చూసి జగ్గారెడ్డి ఆయన గురించి ఆరా తీశారు.
నాలుగున్నర ఎకరాల సాదాసీదా రైతు అయిన లేఖర్.. కాంగ్రెస్ కి వీరాభిమాని. రాహుల్ కోసం ఆయన వెంట చెప్పులు లేకుండా జోడో న్యాయ్ యాత్రలో మణిపూర్ నుంచి ముంబై వరకు పాల్గొన్నాడు. రాహుల్ కోసం ఇంత శ్రమ పడడం ఎందుకని జగ్గారెడ్డి అడగ్గా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని చెప్పారు.