కడసారి సూపైనా దక్కించండి సారూ!

కడసారి సూపైనా దక్కించండి సారూ!

 మే 8న గల్ఫ్​లో గుండెపోటుతో జగిత్యాల వాసి మృతి
 మృతదేహాన్ని రప్పించాలంటూ భార్య వేడుకోలు

జగిత్యాల, వెలుగు: ‘పని దొరక్క అప్పు చేసి మూడేండ్ల కొడుకుని విడిచి బెహరన్ పోయిండు.. 15 ఏండ్లుగా కడుతున్నా బాకీలు తెగలేవ్.. ఆ దేవుడు పాణమైతే కొంటపోయిండు.. కనీసం కడసారి చూపు సూపెట్టుండ్లి సారూ’ అంటు ఓ వలస జీవి భార్య రోధిస్తోంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన ఇందారపు దుబ్బయ్య, పద్మ దంపతులకు కొడుకు నాగరాజు ఉన్నాడు. 15 ఏండ్ల క్రితం 5 తులాల బంగారం కుదువపెట్టి దుబ్బయ్య బెహరన్ వెళ్లాడు. కంపెనీలో ఆరు నెలలు పని చేసి కలివెల్లి అయినట్లు తెలిసింది. ఇంతకాలం పని దొరికినప్పుడల్లా ఇంటికి ఎంతో కొంత పంపించేవాడు. దీంతోపాటు భార్య పద్మ కూలి పని చేస్తూ దివ్యాంగుడైన కొడుకు నాగరాజును పోషిస్తోంది. 2021 మే 8న బెహరన్ లోని తన రూంలో నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి దుబ్బయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.  బాకీల బాధకు పదిహేనేండ్లు స్వగ్రామం రాలేదని, కడసారి చూపైనా చూసేందుకు వీలు కల్పించాలని పద్మ గల్ఫ్​​ జేఏసీ లీడర్ గంగుల మురళీధర్ రెడ్డిని కోరింది. దీంతో మే 10న బెహరన్ లోని భారతీయ రాయబారి ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డెడ్​బాడీ ఇండియాకు వచ్చినా స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ కు సరిపడా డబ్బులు లేవని, ఎవరైనా సాయం చేసి తన భర్త ను కడసారి చూసుకునేలా చేయాలని  పద్మకన్నీరు మున్నీరవుతోంది. తన కొడుకు నాగరాజుకు మాటలు రావని, సరిగ్గా నడవలేడని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది.