ఒకే బడిలో 11 మంది పిల్లలకు కరోనా.. స్కూల్ మూత

ఒకే బడిలో 11 మంది పిల్లలకు కరోనా.. స్కూల్ మూత

రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లోని ఓ స్కూల్ లో 11 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న పిల్లలకు టెస్టులు చేయడంతో పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో 11 మందిని క్వారంటైన్ కు పంపి, చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారితో కాంటాక్ట్ అయిన వారిని ఐసోలేట్ చేసి, బడిని కొద్ది రోజుల పాటు మూసేయాలని నిర్ణయించామని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

రాజస్థాన్ లో కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు ఈ ఏడాది సెప్టెంబర్ లో తెరుచుకున్నాయి. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఆన్ లైన్ క్లాసులు, తొమ్మదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ 50 శాతం కెపాసిటీతో ఫిజికల్ క్లాసులు నిర్వహించాలని రాజస్థాన్ సర్కారు ఆదేశించింది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి తిరిగి క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే టీచర్లకు కనీసం ఒక్క డోసు వ్యాక్సినేషన్ అయినా పూర్తయితేనే క్లాసులకు రావాలని ఆదేశించారు. క్లాసుల్లోనూ ఫిజికల్ డిస్టెన్స్, మాస్కుల వాడకం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే జైపూర్ స్కూల్ లో పిల్లలకు కరోనా వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా స్కూల్ కొద్ది రోజుల పాటూ మూసేశామన్నారు. కాగా, ఆదివారం నాడు తెలంగాణలోని వైరాలో బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 28 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని క్వారంటైన్ కు పంపారు.