అయోధ్యలో ఉగ్రదాడుల ముప్పు: ఇప్పటికే పాక్ నుంచి యూపీలోకి టెర్రరిస్టులు!

అయోధ్యలో ఉగ్రదాడుల ముప్పు: ఇప్పటికే పాక్ నుంచి యూపీలోకి టెర్రరిస్టులు!

అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. టెర్రరిస్టులు దాడికి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్లాన్ చేస్తోందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయోధ్యలో భారీ భద్రతను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. పాక్‌లోని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఉగ్రదాడులు చేయాలని ముష్కరమూకల్ని పంపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. దీనిపై వారు పోలీసుల్ని అప్రమత్తం చేశారు.

అయోధ్య తీర్పు, రామ మందిర నిర్మాణానికి పనుల్లో కదలిక వచ్చిన నేపథ్యంలో ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న జైషే ఉగ్ర సంస్థ తమ కమ్యూనికేషన్‌కు సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మసూద్ అజార్ ఈ యాప్‌లోనే తమ ముష్కరులను అటాక్ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

అయోధ్యలో దాడులు చేయడానికి ఇప్పటికే నేపాల్ సరిహద్దు గుండా భారత్‌లోకి ఏడుగురు పాక్ ముష్కరులు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, అయోధ్య నగరాల్లో ఎక్కడైనా వాళ్లు దాక్కొని ఉండొచ్చని తెలుస్తోంది. వాళ్ల కోసం ఏటీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఆ ముష్కరులకు భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్థానికంగానే అందుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భారత్‌లో ప్రవేశించిన ఏడుగురిలో ఐదుగురు ఉగ్రవాదులు అబూ హమ్జా, మహ్మద్ యకూబ్, నజీర్ అహ్మద్, మొహమ్మద్ షహబాజ్, మొహమ్మద్ ఖ్వామీ చౌధరి అని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది.