
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్ బాగ్, వెలుగు : దేశంలోని ఓబీసీల సమస్యలు, రాజకీయ భవిష్యత్ పై వచ్చే నెల 7న ‘ హలో బీసీ.. చలో అమృత్ సర్’ నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో భాగంగా 9వ జాతీయ ఓబీసీ మహాసభల వాల్ పోస్టర్‌ను సంఘం నేతలతో కలిసి ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఆగస్ట్ 7 ఓబీసీల తలరాతలు మార్చిన రోజు అని, మండల్ కమిషన్ కృషితోనే రిజర్వేషన్లు వచ్చాయని గుర్తుచేశారు. అందుకు అదే రోజున ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో 50 శాతం నిధులు కేటాయించి ప్రధాని మోదీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, సంఘం నేతలు తాటికొండ విక్రమ్ గౌడ్, మణిమంజరి,గౌతమి, జూలూరి భాస్కర్, జాజుల లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.