బీజేపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలి .. బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని ఫైర్   

బీజేపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలి .. బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని ఫైర్   
  • కొన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నయ్  
  • బీజేపీ బీసీ సీఎం ప్రకటన భేష్: జాజుల శ్రీనివాస్ గౌడ్  

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు బీజేపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. శనివారం బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 60 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. టికెట్ల విషయంలో సముచిత స్థానం కల్పించిన పార్టీలకే బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 23 టికెట్లు మాత్రమే ఇచ్చి తన బీసీ వ్యతిరేకతను బయటపెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 టికెట్లు ఇస్తామని మాయమాటలు చెప్పి.. 20 టికెట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.

ఆ టికెట్లు కూడా పార్టీ గెలిచే అవకాశం లేని ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే బీసీని సీఎం చేయాలన్నారు. కనీసం డిప్యూటీ సీఎం, పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులూ ఇవ్వలేదన్నారు. సమావేశంలో సంఘం నాయకులు కుందారం గణేష్ చారి, సింగం నగేష్ గౌడ్, దుర్గయ్య గౌడ్, విక్రమ్ గౌడ్, మహేశ్ యాదవ్, శ్యామల, దేవిక, తదితరులు పాల్గొన్నారు.