బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు బుద్ధి చెప్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు బుద్ధి చెప్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •      బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

 ముషీరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే, లోక్​సభ ఎన్నికల్లోనూ బీసీలకు టికెట్ల కేటాయింపులో ప్రధాన రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ధామాషా ప్రకారం టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. దోమలగూడలోని బీసీ భవన్​లో సోమవారం నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ 17 ఎంపీ స్థానాల్లో బీసీలకు 5, బీఆర్ఎస్ 6 కేటాయిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 13 మందిలో కేవలం ముగ్గురు బీసీలు ఉండడం శోచనీయమన్నారు. రాజకీయ పెట్టుబడి పెట్టలేరనే నెపంతో అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని, మరోసారి అదే వైఖరితో కాంగ్రెస్ ​బీసీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

ప్రజాపాలన పేరుతో కులపాలన చెయొద్దని సూచించారు. 5 శాతం కూడా లేనటువంటి అగ్రకులాలకు పెద్ద పీట వేసి, మిగిలిన కులాలను విస్మరించడం సరికాదన్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తుపై చర్చించి, కార్యాచరణ రూపొందించడానికి ఈ నెల 7న సిటీలో బీసీ సంఘాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు లోక్​సభ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్ గౌడ్, మణి మంజరి సాగర్, గొడుగు మహేశ్​ యాదవ్, జాజుల లింగం గౌడ్, సమతాయాదవ్, ఇంద్రం రజక, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.