V6 News

శంషాబాద్ మున్సిపల్ కమిషనర్​పై  ప్రజా దర్బార్​లో ఫిర్యాదు చేస్తం: జల్​పల్లి నరేందర్ 

శంషాబాద్ మున్సిపల్ కమిషనర్​పై  ప్రజా దర్బార్​లో  ఫిర్యాదు చేస్తం: జల్​పల్లి నరేందర్ 

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​లో జీవో 111 సామాన్యులకు మాత్రమే వర్తిస్తుందా..? బడా బాబులకు వర్తించదా..?  అంటూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్​పల్లి నరేందర్ ప్రశ్నించారు. శుక్రవారం సాతంరాయిలోని కాంగ్రెస్ ఆఫీసులో కౌన్సిలర్ సంజయ్ యాదవ్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ మున్సిపల్​ పరిధి ధర్మగిరి 103 సర్వే నంబర్​లో జీవో 111కు వ్యతిరేకంగా ఫామ్ హౌస్​లు, గెస్ట్ హౌస్​లు నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపించారు. అదే సామాన్యుడు 100 గజాల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని మండిపడ్డారు.

ధర్మగిరిలో 800 గజాల్లో  భారీ కట్టడాలు ఫామ్ హౌస్​లు నిర్మిస్తున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బడా బాబులు ఇచ్చే మామూళ్లకు తలోగ్గారా? అంటూ అధికారులను ఆయన ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని  గత అక్టోబర్​లో శంషాబాద్ మున్సిపల్ కమిషనర్​కు వినతిపత్రం అందజేస్తే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, అక్రమ నిర్మాణదారులకు మద్దతుగా నిలుస్తున్నారని నరేందర్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజా దర్బార్​లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో  కాంగ్రెస్​ నేతలు ప్రసాద్, పాపారావు, మహేందర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.