- ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై చెలరేగిన వివాదం
వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్‌పై వివాదం చెలరేగింది.జేమ్స్ కోమీ ఇటీవల సముద్రపు తీరంలో గవ్వలతో రాసి ఉన్న "86 47" నంబర్ ను ఫోటో తీసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. "నా బీచ్ వాక్‌లో కూల్ షెల్ నిర్మాణం" అని దానికి కోమీ క్యాప్షన్ ఇచ్చాడు.
అయితే, ఈ పోస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపుతామంటూ చేసిన బెదిరింపేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ట్రంప్ తన మొదటి టర్మ్‌లో కోమీని ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారని.. ఆ కోపంతోనే ఆయన ఇలా బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. "86 47" లో "86" అనేది అమెరికన్ స్లాంగ్‌లో "తొలగించు" లేదా "చంపడం" అనే అర్థం వస్తుందని.. అలాగే, "47" అనేది 47వ అధ్యక్షుడైన ట్రంప్‌ను సూచిస్తున్నదని వెల్లడించారు. కోమీని వెంటనే అరెస్ట్ చేసి.. అతని పోస్ట్‌పై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు ఏం చేబుతున్నారంటే..!
జేమ్స్ కోమీ పోస్ట్ వివాదంపై సీక్రెట్ సర్వీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. జేమ్స్ కోమీ ఏఉద్దేశంతో ఆ పోస్ట్ పెట్టాడో త్వరలోనే తేలుస్తామని చెప్పారు. ఈ పోస్ట్ గురించి తమకు కూడా తెలుసని, సీక్రెట్ సర్వీస్‌కు అవసరమైన సహాయం అందిస్తామని ప్రస్తుత ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ వెల్లడించారు. బ్యూరో యుఎస్ సీక్రెట్ సర్వీస్‌తో సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
కోమీని జైలులో పెట్టాలని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఫైర్ అయ్యారు. అయితే, వివాదం తీవ్రమవడంతో కోమీ తన పోస్ట్‌ను తొలగించారు. దానిపై ఇన్‌స్టాగ్రామ్‌లోనే వివరణ ఇచ్చారు. "నేను బీచ్ వాక్‌లో షెల్స్‌ను చూశాను. అది బాగుందని మామూలుగా ఫొటోతీసి పోస్ట్ చేశాను. "86 47" నంబర్ ను హత్యలు చేయటానికి ఉపయోగిస్తారని నాకు నిజంగా తెలియదు. ట్రంపును చంపాలనే ఉద్దే శం నాకు లేదు. నేను హింసకు వ్యతిరేకం. కాబట్టి నా పోస్ట్‌ను తొలగించాను" అని రాశారు.
