మహాభారతంలో జమ్మి చెట్టు ప్రాముఖ్యత

మహాభారతంలో జమ్మి చెట్టు ప్రాముఖ్యత

జమ్మి చెట్టుకు హిందూ పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది.  క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయి.  వాటిల్లో జమ్మిచెట్టు కూడా ఒకటి. దీన్ని సంస్కృతంలో శమీ వృక్షం అంటారు.   యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు... ముందుగా జమ్మిచెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవారు. రామాయణం, భారతాల్లో జమ్మికి విశిష్ట స్థానం ఉంది. రావణుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు... రాముడు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజించినట్టు పండితులు చెబుతున్నారు. 

ఇక భారతంలోనూ జమ్మిచెట్టుకు ప్రాముఖ్యత ఉంది.  మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళేముందు తమ బట్టలు, ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచి ఉంచుతారు.  ఆ తర్వాత విరాట్ రాజు కొలువులో ఉండి... అజ్ఞాతవాసం ముగిశాక ఈ చెట్టుకు నమస్కరించి... ఆయుధాలను కిందకి దించి కౌరవులతో యుద్ధం చేసి విజయం సాధిస్తారు. అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు శమీ వృక్షాన్ని పూజిస్తారు. 

దసరా రోజున సాయంత్రం శమీవృక్షం దగ్గర అపరాజితా దేవిని పూజిస్తారు. 
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం 

అని శ్లోకం చదువుకొని... జమ్మి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి... దాని ఆకులను బంగారంగా పిలుచుకుంటూ... అలయ్ బలయ్ చేసుకుంటారు. పెద్దల దగ్గర పిల్లలు ఆశీర్వాదాలు తీసుకుంటారు. దసరా రోజున ఇలా పూజ చేస్తే జీవితంలో సకల విజయాలు కలుగుతాయని నమ్ముతారు.  అయితే చాలా గ్రామాలు, పట్టణాల్లో జమ్మి చెట్లు అందుబాటులో లేవు.  దాంతో కొందరు ఈ చెట్టు కొమ్మను తీసుకొచ్చి... నిలబెట్టి దానికే పూజలు చేస్తుంటారు.

పురాణాల్లో ఎంతో విశిష్టత కలిగిన... రాష్ట్ర వృక్షం కూడా అయిన ఈ జమ్మి చెట్లను హైదరాబాద్ నిమ్స్ లో ప్రత్యేకంగా పెంచుతున్నారు.  2016లో నిమ్స్ లో 3 ఎకరాల్లో వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చి వేశారు.  వేప, కదంబ, ఏక బిల్వం, వేప, ఉసిరి లాంటి మొక్కలతో పాటు... పూలు, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. వీటిల్లో నాగార్జున సాగర్ నర్సరీ నుంచి 12 జమ్మి మొక్కలను తీసుకొచ్చి... ఇక్కడ నాటామని నిమ్స్ RMO రమేష్ తెలిపారు. నిమ్స్ కుటుంబం అంతా వీటిని కాపాడుకుంటున్నామన్నారు. 

ఆరేళ్ళ క్రితం నిమ్స్ ఆవరణలో నాటిన జమ్మి మొక్కలు ఇప్పుడు వృక్షాలు అయ్యాయి.  ప్రతి యేటా దసరా రోజున నిమ్స్ సిబ్బంది అంతా ఈ చెట్లను దర్శించుకొని... పూజలు చేస్తామని  RMO రమేష్ అంటున్నారు. పురాణ ఇతిహాసాల నుంచి ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ జమ్మి చెట్టుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్టు చెప్పారు.  ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మిచెట్టు క్రమంగా అంతరించిపోతున్నాయి. దాంతో గత రెండేళ్ళుగా ప్రభుత్వం జమ్మి చెట్లను నాటుతోంది. ప్రతి ఊరు, ప్రతి గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడి గుడికో జమ్మిచెట్టు నినాదంతో ముందుకెళ్తోంది.