ఐఈఎస్ లో 2వ ర్యాంక్ సాధించిన రైతు బిడ్డ

ఐఈఎస్ లో 2వ ర్యాంక్ సాధించిన రైతు బిడ్డ
  • తొలి ప్రయత్నంలోనే ర్యాంక్ కొట్టిన తన్వీర్ అహమ్మద్ ఖాన్
  • ఐఈఎస్-2020 ఫలితాల్లో తన్వీర్ కు 2వ ర్యాంక్
  • కరోనా మొదలైనప్పుడు నాలుగు గోడలకే పరిమితమై చదువుపైనే దృష్టి పెట్టా
  • కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ నా చదువుపై ప్రభావం పడనివ్వలేదు
  • ఇదే చివరి అవకాశంగా భావించి పరీక్షలపై మనసు లగ్నం చేశా: తన్వీనర్ అహ్మద్ ఖాన్

శ్రీనగర్:  ‘‘ కోవిడ్ తొలిదశ గురించి ప్రపంచ మంతా భయంతో వణికతపోతోంది.. బయట రకరకాల ప్రచారం జరుగుతోంది.  నా చదువుకు భంగం వాటిల్లకుండా ఒక పక్క ఎంఫిల్ కోర్సు చేస్తూనే... ఐఈఎస్ (IES)  పరీక్షకు సిద్ధమయ్యాను.. నా చదువు. . దైనందిన టైం టేబుల్ పై కోవిడ్ ప్రభావం పడనివ్వలేదు.. ఇదే చివరి అవకాశం..గా భావించి పరీక్షకు సన్నద్ధమయ్యా..’’ ఐఈఎస్ రెండో ర్యాంకు విజేత తన్వీర్ అహమ్మద్ ఖాన్ చెప్పిన మాటలివి. జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఈ రైతు బిడ్డ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఇండియన్‌ ఎకనామక్‌ సర్వీస్‌ -2020 (ఐఇఎస్‌)లో తొలి ప్రయత్నంలోనే 2వ ర్యాంక్‌ తెచ్చుకుని...ఔరా అనిపించారు.
తన్వీర్ అమ్మద్ ఖాన్ నిరుపేద రైతు బిడ్డ
తన్వీర్ అహ్మద్ ఖాన్ స్వస్థలం జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని మారుమూల ప్రాంతం నిగిన్‌పోరా కుంద్‌ గ్రామం. శ్రీనగర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. అతడి తండ్రి ఓ నిరుపేద రైతు. ఇలాంటి సామాన్య పేద రైతు ఇంట పుట్టిన తన్వీర్ అహ్మద్ ఖాన్ ఇటీవల యుపిఎస్‌సి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐఇఎస్‌ -2020 పరీక్షలో ఏకంగా 2వ ర్యాంక్‌  సాధించి సత్తా చాటాడు. తన్వీర్‌ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కుంద్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తయింది. ఆ తర్వాత వాల్టెంగూలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఉన్నత విద్యనభ్యసించాడు. 12వ తరగతి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ ఉత్తీర్ణుడయ్యాక...అనంతనాగ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2016లో బిఎ పూర్తి చేశాడు. చిన్నతనంలో టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా ఆలకించేవాడు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే బాగా చదువుకుంటేనే సాధ్యమన్న మాటలు బలంగా నాటుకుపోయాయి. అందుకే తొలి నుండి చదువు అంటే ఇష్టం ప్రదర్శించేవాడు. డిగ్రీ పూర్తయ్యాక కాశ్మీర్‌ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల్లో మూడవ ర్యాంక్‌ను తెచ్చుకోవడమే కాకుండా...అదే విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశం పొందారు. పీజీ చేస్తుండగా చివరి సంవత్సరంలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జెఆర్‌ఎఫ్‌) సాధించడం ద్వారా మరో ఘనతను సాధించాడు. జెఆర్‌ఎఫ్‌ ఫెలోగా..కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేశారు.
చలికాలంలో డబ్బుల కోసం కోల్‌కతాలో రిక్షా తోలిన తన్వీనర్
శ్రీనగర్ ప్రాంతంలోని పేదలు శీతాకాలంలో ఉపాధి దొరక్క ఇబ్బందిపడుతుంటారు. చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటే ఇదే కోవలేనే తన్వీర్ అహ్మద్ ఖాన్ కూడా చలికాలంలో రిక్షా తోలేందుకు కోల్‌కతా వెళ్లాడు. చదువు కోసం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో రిక్షా తొక్కి డబ్బులు కూడగట్టుకునేవాడు. కోల్‌కతాలో శీతాకాలంలో సీజనల్ రిక్షా డ్రైవర్‌గా కూడా పనిచేశారు. ఒక లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కష్టపడటం లక్ష్య సాధనలో భాగం మాత్రమేనని భావించానని.. తన కష్టం ఖచ్చితంగా విజయానికి దారితీస్తుందనే నమ్మకం ఉండిందని ఖాన్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఉపాధి కోసం చదువు పక్కన పెట్టి రిక్షా తోలేందుకు కోల్ కతా వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ఈ ఘనత సాధించడంతో కుటుంబంతో పాటు స్వగ్రామం పులకించిపోయింది. గ్రామస్తులు పూల దండలు, మిఠాయిలతో తన్వీన్ కుటుంబాన్ని ఘనంగా సత్కరించారు.  
లక్ష్యం పై మనసు పెడితే చాలు
తాను సాధించిన విజయంపై తన్వీర్‌ అహమ్మద్ ఖాన్ మీడియా వారితో మాట్లాడుతూ...లక్ష్యంపై గురిపెడితే ..ఏదీ అసాధ్యం కాదు అని చెప్పారు. కరోనా సమయాన్ని కూడా తాను ఎలా సద్వినియోగపరుచుకున్న విషయాన్ని పంచుకున్నారు. కోవిడ్‌ సమయంలో ఇంట్లోనే ఉంటూ..ఎంఫిల్‌ చేస్తూనే ఐఇఎస్‌ పరీక్షకు సిద్ధమయ్యానని చెప్పారు. కోవిడ్‌ను కూడా లెక్కచేయకుండా తను నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం.. ప్రతిరోజు టైం టేబుల్ వేసుకుని మరీ ప్రిపేర్‌ అయ్యాయని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే ఐఇఎస్‌ ర్యాంకు రావడం కష్టమైనప్పటికీ... తాను ఎక్కడా ఆశను కోల్పోలేదని చెప్పారు. తన తొలి ప్రయత్నాన్నే..చివరి ప్రయత్నంగా భావిస్తూ చదవడం వల్లే తన లక్ష్యాన్ని సాధించగలిగానని అన్నారు. ర్యాంకు వస్తుందనే నమ్మకం ఏర్పడింది కానీ.. మరీ సెకండ్ ర్యాంక్ అంటే ఒకింత ఆశ్చర్యంగా ఉందన్నారు. ర్యాంకు సాధించిన తన్వీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తదితరులు అభినందనలు తెలిపారు.