జమ్మూకాశ్మీర్​: టెర్రరిస్టుల కోసం వేట..అనంత్​నాగ్​లో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్

జమ్మూకాశ్మీర్​: టెర్రరిస్టుల కోసం వేట..అనంత్​నాగ్​లో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
  • ఇద్దరు టెర్రరిస్టులను చుట్టుముట్టిన బలగాలు
  • ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లకు గాయాలు 

అనంత్​నాగ్: జమ్మూకాశ్మీర్​లోని అనంత్​నాగ్​లో టెర్రరిస్టుల ఏరివేతకు వేట కొనసాగుతోంది. ముగ్గురు జవాన్లను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ తిరిగి ప్రారంభించామని ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు. 

కోకెర్​నాగ్​లోని అటవీప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ మొదలైందన్నారు. లష్కరే తాయిబాకు చెందిన కార్యకర్త ఉజైర్​ఖాన్ అనే స్థానికుడితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు.

టెర్రరిస్టులతో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో మన ఆర్మీ ఆఫీసర్లు కల్నల్ మన్​ప్రీత్​సింగ్, మేజర్ అశిష్ ధోనాక్, డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్ పోలీస్ హుమాయూన్ భట్ ప్రాణాలు కోల్పోయారు. దాంతో మన సైన్యం సెర్చింగ్ ఆపరేషన్​కు బ్రేక్ ఇచ్చింది. 

ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తాయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఈ నెల మొదట్లో పీవోకేలోని తమ నాయకుడు రియాజ్ అహ్మద్​ను హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. 

ఎన్​కౌంటర్ స్పాట్ నుంచి కల్నల్ మన్​ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్  మృతదేహాలను గురువారం విమానంలో వారి సొంతూర్లకు తరలించారు. అంతకుముందు అమర జవాన్ల భౌతికకాయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, పోలీస్, సివిల్ అధికారులు లాంఛనాలతో నివాళి అర్పించారు. 

కన్నీటి వీడ్కోలు.. 

డీఎస్పీ హుమాయూన్ భట్​కు బుద్గామ్​లోని ఆయన స్వస్థలమైన హమ్​హమాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తుదివీడ్కోలు కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చారు. భట్​ జమ్మూకాశ్మీర్​లోని పోలీస్ విభాగంలో డీఎస్పీగా ఉన్నారు. ఆయనకు కిందటేడాది వివాహం కాగా నెలన్నర కిందే తండ్రయ్యాడు. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న వాళ్ల కుటుంబానికి భట్ మరణం విషాదాన్ని మిగిల్చింది. 

మళ్లీ కాల్ చేస్తానని చెప్పి.. 

19రాష్ట్రీయ రైఫిల్ దళ కమాండర్​గా ఉన్న కల్నల్ మన్​ప్రీత్ సింగ్ మరణానికి కొద్ది గంటల ముందు ఇంట్లో వాళ్లతో ఫోన్​లో మాట్లాడారు. ఆయన మాటలు తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 

బుధవారం ఉదయం 6.45కు చివరిసారిగా ఆయన తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేశారు. ఆపై జరిగిన ఎన్​కౌంటర్​లో మరణించారు. ఈ విషయాన్ని తలచుకుంటూ మన్​ప్రీత్ భార్య జగ్మీత్, ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. 

వీరమరణం పొందిన మరో జవాను మేజర్ ఆశిష్ దొనక్(34)కు భార్య, రెండేండ్ల కూతురు ఉన్నారు. హర్యానాలోని పానిపట్​లో ఆయన కుటుంబం నివసిస్తోంది. నెలన్నర కిందే ఆయన ఇంటికి వచ్చారని, అక్టోబర్​లో మళ్లీ రావాల్సి ఉందని, ఇంతలోనే దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. 

పాక్ తో చర్చించాలె:​ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్​లో రక్తపాతం అంతం కావాలంటే భారత్‌‌, పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాలని నేషనల్‌‌ కాన్ఫరెన్స్‌‌ (ఎన్‌‌సీ) చీఫ్ ఫరూఖ్​ అబ్దుల్లా అన్నారు. అంతకుమించి మరో మార్గం లేదని చెప్పారు. ఇరు దేశాలు మొండివైఖరిని వీడాలన్నారు. 

రాష్ట్రంలో రక్తపాతం జరుగుతుంటే కేంద్రం మాత్రం ఇక్కడ టెర్రరిజాన్ని అంతం చేశామని చెప్పుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఫెయిల్ అయ్యాయని పీపుల్స్ డెమోక్రటిక్  కూడా పార్టీ విమర్శించింది.