జనగామ జిల్లాలో163 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం..బహిరంగ మార్కెట్లో జాగ విలువ రూ.48 కోట్లు

జనగామ జిల్లాలో163 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం..బహిరంగ మార్కెట్లో జాగ విలువ రూ.48 కోట్లు

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో దశాబ్దాలుగా అన్యాక్రాంతమైన గైరాన్​ భూమిని అధికారులు స్వాధీనం చేసుకొని, తిరిగి నిషేధిత జాబితాలోకి చేర్చారు. స్వాధీనం చేసుకున్న భూమి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.48 కోట్లుగా ఉంటుంది. వివరాలిలా ఉన్నాయి..

 జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సల్వాపూర్​లోని 147 సర్వే నంబర్​లో 163 ఎకరాల గైరాన్(బంచరాయి) భూమి ఉంది. గైరాన్​ భూమిని ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి మార్చే అధికారం ఎవరికీ లేదు. అయినప్పటికీ 20 ఏండ్ల కింద ఈ భూమిని అక్రమంగా ప్రైవేట్​ వ్యక్తులు కాజేశారు. ఆ తర్వాత చేతులు మారి మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌‌బుక్‌‌లు, టైటిల్  డీడ్‌‌లు జారీ అయ్యాయి. ఈ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది.

కలెక్టర్​ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..

ఈ భూమిపై హైకోర్టు సూచనల మేరకు జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా విచారణకు ఆదేశించారు. విచారణ నిర్వహించిన ఆఫీసర్లు జరిగిందేమిటో గుర్తించారు. మూలాధార సెటిల్‌‌మెంట్  రికార్డు(సేత్వార్)లో గైరాన్​గా గుర్తించడంతో పాటు పీవోబీలో చేర్చారు. అయినప్పటికీ భూమిపై ఎలాంటి హక్కు లేని వ్యక్తులు అమ్మకపు దస్తావేజుల ద్వారా చేజిక్కించుకున్నారు. ఈ ల్యాండ్​ను రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో ఒక ఆఫీసర్​ పట్టా భూమిగా మార్చేసినట్లు గుర్తించారు. 

ఆ తరువాత వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగపడేలా మార్చడంతో పాటు నిషేధిత జాబితా నుంచి తొలగించారని రెవెన్యూ ఆఫీసర్లు నిర్దారించారు. రూల్స్​ ప్రకారం గైరాన్​ భూమిని పట్టాగా మార్చే అధికారం కలెక్టర్​కు కూడా ఉండదు. విచారణ అనంతరం కలెక్టర్​ ఆదేశాలతో రెవెన్యూ ఆఫీసర్లు 84 ఎకరాల భూమిని పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు. 

ఆ తర్వాత దస్తావేజు రిజిస్ట్రేషన్​ను రద్దు చేసి 147 సర్వే నంబర్​లోని మొత్తం భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మొత్తం163 ఎకరాలు ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తూ బోర్డు పెట్టారు. పట్టాను రద్దు చేయడంతో పాటు గైరాన్​గా గుర్తిస్తున్నట్లు ప్రకటించి, నిషేధిత జాబితాలోకి చేర్చారు.

 ఇదిలాఉంటే ప్రభుత్వం ఇటీవల సవరించిన మార్కెట్​ విలువ ప్రకారం బచ్చన్నపేట మండలంలో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ఉంది. ప్రజ్ఞాపూర్​ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో ఈ భూమికి బహిరంగ మార్కెట్​లో ఎకరానికి రూ.30 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన దీని విలు రూ.48 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.