సమస్యకు పరిష్కారం చూపారు..23 ఏళ్లుగా భూ సమస్య.. ప్రజావాణి దరఖాస్తుతో పరిష్కారం

సమస్యకు పరిష్కారం చూపారు..23 ఏళ్లుగా భూ సమస్య.. ప్రజావాణి దరఖాస్తుతో పరిష్కారం

జనగామ/ జనగామ అర్బన్, వెలుగు: ఏండ్ల తరబడి వివాదంలో ఉన్న భూ సమస్యను ప్రజావాణిలోనే జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్ ఝా పరిష్కరించారు. జనగామ మండలం శామీర్​పేట్​కు బడుక రాంచందర్‌‌‌‌కు సంబంధించిన 23 గుంటల భూమి కొన్నేండ్ల కింద అతడి అన్న కూతురు పేరుపై బదిలీ అయింది.

 గత నెలలో నిర్వహించిన ప్రజావాణిలో రాంచందర్​ కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించడంతో రికార్డులు పరిశీలించి అక్రమంగా బదిలీ అయిందని నిర్దారించి, విషయాన్ని కలెక్టర్​కు తెలిపారు. 

ఆయన వెంటనే భూమిని తిరిగి రాంచందర్​ పేరుపై బదలాయించాలని ఆదేశించారు. వెంటనే 23 గుంటల భూమిని తిరిగి రాంచందర్​కు బదలాయించారు. దీంతో కలెక్టర్​ సందీప్​కుమార్ ఝాను రాంచందర్​ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సోమవారం ఒక్కరోజే 532 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 


ములుగు/ భూపాలపల్లి రూరల్/ ఖమ్మం టౌన్/ హనుమకొండ కలెక్టరేట్​/ కాశీబుగ్గ/ భద్రాచలం ​, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా కలెక్టరేట్లలో  నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ములుగు గ్రీవెన్స్​కు ప్రజల నుంచి 73 దరఖాస్తులు వ్చాయని కలెక్టర్​ బోర్ఖడే హేమంత్​సహదేవరావు తెలిపారు. 

అనంతరం ఆయన భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, పింఛన్ల మంజూరుతోపాటు వివిధ అంశాలపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జయశంకర్​భూపాలపల్లి ఐడీవోసీ ఆఫీస్​లో నిర్వహించిన ప్రోగ్రామ్​కు 66 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ఖమ్మంలో 100 ఫిర్యాదులు అందాయని కలెక్టర్​ దివాకర పేర్కొన్నారు. 

హనుమకొండ కలెక్టరేట్​ప్రజావాణిలో 263 మంది అర్జీలు అందజేశారని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. వరంగల్​లో కలెక్టర్​ సత్యశారద, భద్రాచలం ఐటీడీఏలో ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్, సబ్​ కలెక్టర్ ఆఫీసులో సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ నిర్వహించారు.