జన సైనికుల సేవా కార్యక్రమాలు అపూర్వం

 జన సైనికుల సేవా కార్యక్రమాలు అపూర్వం

అమరావతి: కరోనా మహమ్మారి ప్రబలి ప్రజలు భయం భయంతో  ఉన్న సమయంలో జనసేన సైనికులు రంగంలోకి దిగి మేమున్నామంటూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని.. అలాగే ప్రజాసేవలో ఉంటూ అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారికి జనసేన ఆవిర్భావను సభ అంకితం చేస్తున్నామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కరోనా మహమ్మారి బారినపడి కోలుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు సభా వేదికగా సంతాపం తెలియజేశారు. 

తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన 8వ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. సభా వేదికకు దామోదరం సంజీవయ్య వేదికగా నామకరణం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు ఆ పార్టీ నేత నాగబాబు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. 

తొలుత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య పేద ఎస్సీ కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో, ప్రతిబతో అంచెలంచెలుగా ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, కుగ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దామోదరం సంజీవయ్య గురించి ఏ పార్టీ నాయకుడూ మాట్లాడట్లేదని అన్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలకు గురయ్యారని,  పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. పవన్ తెలుగు ప్రజల కోసం ఎవరినైనా ఎదుర్కొంటారని తెలిపారు. సంక్షేమం పేరుతో విలువలు లేని రాజకీయాలు చేస్తూ భూ కబ్జాలు చేస్తూ.. చెరువులు తవ్వేస్తూ, నది పరివాహక ప్రాంతాలను ఆక్రమించి లక్షల కోట్లు సంపాదిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.అమరావతిని నాశనం చేశారని, 9 అంతస్తుల భవనం ఖాళీగా పడి ఉందని, అమరావతిలో ఒకప్పుడు 8 కోట్లు పలికిన భూమి.. ఇప్పుడు 3 కోట్లకు పడిపోయిందని.. 30-40 శాతం మందికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సంక్షేమం పేరుతో ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

అమరావతిని నాశనానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మూడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?  23 వేల ఉద్యోగాలకు కోటి 45 లక్షల మంది పోటీపడుతున్నారని, జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మోసం చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో జీతాలు ఇచ్చి మరీ మనపై దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, జనసేన పార్టీపై దుష్ప్రచారం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. మనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోయినా జనం కోసం పోరాడుతామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 
జనసేన నేత హరిప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి సామర్థ్యం పవన్ కళ్యాణ్ కే ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు జనసేన కట్టుబడి ఉందని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం పవన్ కళ్యాణ్ కే సాధ్యమన్నారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా భారీ జనసమీకరణ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పార్టీ శ్రేణులు ఇవాళ నిర్వహించిన ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చారు. 

 

 

ఇవి కూడా చదవండి

వైసీపీకి సహకరించిన వాళ్లను పట్టించుకోవడం లేదు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్