అనకాపల్లి, భీమవరం స్థానాలపై జనసేనలో రగడ..!

అనకాపల్లి, భీమవరం స్థానాలపై జనసేనలో రగడ..!

టీడీపీ, జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందా అన్న పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన నాడే కొంతమంది జనసేన కార్యకర్తలు విముఖత వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన టీడీపీ, జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితా తర్వాత ఇరుపార్టీల్లో అసమ్మతి పీక్స్ కి చేరింది. టీడీపీ మాట పక్కనపెడితే, జనసేన శ్రేణుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అసలే తమ పార్టీకి కేటాయించింది 24 అసెంబ్లీ సీట్లు, 3ఎంపీ సీట్లు. దీనికి తోడు కేవలం 5స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశాడు పవన్.

పవన్ కళ్యాణ్ ప్రకటించని మిగతా సీట్లలో జనసేననను నమ్ముకున్న వారికే స్థానం దక్కుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. అనకాపల్లి సీటును జనసేన నాయకులకు కాకుండా ఇటీవల టీడీపీ నుండి జనసేనలో జాయిన్ అయిన కొణతాలకు కేటాయించటం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతే కాకుండా ముందు నుండి తమదే అనుకున్న భీమవరం నియోజకవర్గం కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబుకు ఇవ్వడంపై జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటిదాకా పవర్ షేరింగ్, గౌరవప్రదమైన సీట్లు అంటూ స్పీచ్ లు  ఇచ్చిన పవన్ ఇప్పుడు కేటాయించిన 24 స్థానాల్లో కూడా జనసేన నాయకులకు స్థానం ఇవ్వకపోవటం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీలో స్థానం దక్కని వారికి టికెట్ ఇచ్చేందుకు సపరేట్ గా పార్టీ పెట్టుకోవాలా అంటూ మండిపడుతున్నారు కార్యకర్తలు.ఇదే పరిస్థితి కొనసాగితే జనసేన ఓట్ టీడీపీ కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది పోయి ఉన్న కాస్తో కూస్తో ఓట్ షేర్ కూడా గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది