రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను పారదోలాలి 

రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను పారదోలాలి 

కోదాడ/చౌటుప్పల్, వెలుగు: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లలో జనసేన పోటీచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్​కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో ముందు వరుసలో నిలిచిన స్టూడెంట్లు, యువత.. ఇప్పుడు రాజకీయాలను కూడా ముందుండి నడిపించాలని, వారసత్వ రాజకీయాలను పారదోలాలని పిలుపునిచ్చారు. ఇటీవల యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లిలో ప్రమాదవశాత్తు చనిపోయిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని చౌటుప్పల్​లో పవన్ పరామర్శించారు. సైదుల పిల్లల విద్య, వైద్యం ఖర్చు జనసేన భరిస్తుందని హామీ ఇచ్చారు. సైదులు కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల ప్రమాదంలో మరణించిన కడియం శ్రీనివాసరావు అనే కార్యకర్త కుటుంబసభ్యులను కూడా పవన్ పరామర్శించి, రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.  
ముగ్గురు అభిమానులకు గాయాలు

తొలిసారి కోదాడకు వచ్చిన పవన్‌‌‌‌కల్యాణ్​కు ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని ఆకుపాముల బైపాస్‌‌ నుంచి కార్యకర్తలు పవన్‌‌‌‌కల్యాణ్ కాన్వాయ్‌‌‌‌ వెంట బైక్‌‌‌‌ర్యాలీ  నిర్వహించారు. మార్కెట్‌‌‌‌ కమిటీ ఆఫీసు వద్ద అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్‌‌ ‌‌కాన్వాయ్‌‌‌‌లోని వాహనం ఢీకొనడంతో నాయబ్‌‌‌‌ రసూల్‌‌‌‌, అరవింద్‌‌ ‌‌అనే యువకులు కిందపడ్డారు. అరవింద్‌‌ ‌‌కాలుకు ఫ్రాక్చర్‌‌ ‌‌కాగా, రసూల్‌‌‌‌కు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కుటుంబసభ్యుల ఇంటివద్ద తొక్కిసలాట జరగడంతో కనకేశ్వరరరావు అనే వ్యక్తికి 
గాయాలయ్యాయి. 

జనసేన పుట్టుకకు నల్గొండనే స్ఫూర్తి 

జనసేన పార్టీ ఆవిర్భావానికి నల్గొండ జిల్లానే స్ఫూర్తినిచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పారు. తమ్ముడు సినిమా తీసిన సమయంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందన్నారు. జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనుకుంటే స్థానిక రాజకీయ నాయకుడు అడ్డుకున్నాడని తెలిపారు. అప్పుడే తాను రాజకీయ పార్టీ పెడితేనే అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయవచ్చనే నిర్ణయానికి వచ్చానన్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. తనకు ఏపీ జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. త్వరలో హైదరాబాద్​లో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లలో  పోటీచేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తామా? రామా? అనేది పక్కనపెడితే కచ్చితంగా ప్రభావం చూపుతామన్నారు.