జమ్మూకాశ్మీర్​ ఓటర్ల జాబితాలో నాన్​లోకల్స్​ను చేర్చితే ఊరుకోం

జమ్మూకాశ్మీర్​ ఓటర్ల జాబితాలో నాన్​లోకల్స్​ను చేర్చితే ఊరుకోం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​ ఓటర్ల జాబితాలో నాన్​లోకల్స్​ను చేర్చే నిర్ణయాన్ని ఒప్పుకునేదిలేదని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూఖ్​ అబ్దుల్లా అన్నారు. కోర్టులోనే కాకుండా అన్ని రకాలుగా కొట్లాడుతామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఇప్పటికే కాశ్మీర్ ప్రత్యేక హక్కులను దోచుకున్న కేంద్ర సర్కారు ఇక్కడి ప్రజల ఐడెంటిటీని కూడా దెబ్బతీసే చర్యలకు పాల్పడితే తిప్పికొడతామని చెప్పారు. కాశ్మీర్ ఓటర్ల జాబితాలో నాన్​లోకల్స్​ను చేర్చే అంశంపై చర్చించేందుకు అబ్దుల్లా ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం 9 పార్టీలు భేటీ అయ్యాయి. కాంగ్రెస్, పీడీపీ, ఏఎన్‌‌‌‌సీ, శివసేన, సీపీఐ, సీపీఐ(ఎం), జేడీయూ, అకాలీదళ్ మాన్ నేతలు హాజరయ్యారు. కాగా, ఈ అంశంపై ఆ పార్టీలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నాయని బీజేపీ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా మండిపడ్డారు.

పార్లమెంటు ఎదుట నిరాహార దీక్ష: సజ్జద్

జమ్మూకాశ్మీర్​లో నాన్​లోకల్స్​కు ఓటు హక్కు కల్పించినట్లుతేలితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల ముందు నిరసనలు చేపడతామని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జద్ గని లోన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇదే అంశంపై ఫలితం వచ్చేతీరుగా కొట్లాడుతలేదని, అందుకే ఆ పార్టీ పెట్టిన సమావేశానికి తాము పోలేదని అప్నీ పార్టీ నేత అల్తాఫ్​ బుఖార్​తో కలిసి ఆయన మీడియాకు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో నాన్​లోకల్స్​కు చోటిస్తే పార్లమెంటు ఎదుట నిరాహార దీక్షకు దిగుతామన్నారు. ‘‘ప్రభుత్వం కావాలనిచేస్తే తప్ప బయటోళ్లు ఇక్కడి ఓటర్లుగా నమోదు కావడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. చట్టం మా వైపే ఉంది కానీ, కేంద్ర ప్రభుత్వ పాలకులతోనే సమస్య. ఇక్కడేం జరుగుతుందో దేశమంతటికీ తెల్వాలి”అని సజ్జద్ చెప్పారు.