
జన్నారం, వెలుగు: డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు రిజర్వ్ సీఎఫ్, మంచిర్యాల ఎఫ్డీపీటీ శాంతారాం తెలిపారు. గురువారం స్థానిక అటవీశాఖ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జన్నారం డిప్యూటి రేంజ్ ఆఫీసర్ తిరుపతికి మెమో జారీచేసినట్లు చెప్పారు. అభయారణ్యంలోని జన్నారం అటవీ బీట్ లోని కొత్తూరుపల్లి సమీప రిజర్వ్ ఫారెస్ట్ లో కొన్నేండ్లుగా గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.
రెండు నెలల కింద ఇదే ప్రాంతంలోని 22 మంది గిరిజనులు గుడిసెలపై అటవీ అధికారులు దాడులు చేసి తొలగించారు. మళ్లీ అక్కడే గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. బుధవారం సాయంత్రం వెళ్లి చూసే వరకు సంబంధిత అటవీ అధికారులు పట్టించుకోలేదని, అటవీ భూములను సంరక్షణలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కు మెమో జారీ చేసినట్లు ఆయన తెలిపారు.