
యూఎస్ ఓపెన్ 2025లో ముగ్గురు స్టార్ ప్లేయర్ల హవా కొనసాగుతుంది. నోవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్, జనిక్ సిన్నర్ సెమీస్ లో అడుగుపెట్టారు. గత రెండేళ్లుగా గ్రాండ్ స్లామ్ ఏదైనా వీరు ముగ్గురు ఆధిపత్యం చూపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ లోనూ ఈ త్రయం తిరుగులేని ఆట తీరుతో సెమీస్ కు చేరుకున్నారు. బుధవారం జొకోవిచ్, అల్కరాజ్ సెమీస్ కు చేరుకోగా.. భారత కాలమాన ప్రకారం గురువారం (సెప్టెంబర్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్ ఇటాలియన్ లోరెంజో ముసెట్టిని వరుస సెట్లలో ఓడించాడు.
కేవలం రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో సిన్నర్ 6-1, 6-4, 6-2 తేడాతో ముసెట్టిని చిత్తుగా ఓడించాడు. హార్డ్-కోర్ట్ గ్రాండ్ స్లామ్‌లలో సిన్నర్ కు ఇది వరుసగా 26 విజయం కావడం విశేషం. హార్డ్ కోర్ట్ లో గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సిన్నర్.. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గాడు. సిన్నర్ పదునైన స్ట్రోక్ ప్లే ముందు ముసెట్టి నిలవలేకపోయాడు. సిన్నర్ ఐదు సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయగా.. ముసెట్టి ఒక్కసారి కూడా సిన్నర్ సర్వీస్ బ్రేక్ చేయలేకపోయాడు. మరో సెమీ ఫైనల్లో అలెక్స్ డిమినార్ పై ఫెలిక్స్ అగర్-అలియాసిమ్ నాలుగు సెట్లలో విజయం సాధించాడు.
బుధవారం (సెప్టెంబర్ 3) రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో ఫెలిక్స్ అగర్-అలియాసిమ్ 4-6, 7-6(7), 7-5, 7-6(4)తో డిమినార్ పై చెమటోడ్చి గెలిచాడు. శుక్రవారం జరిగే సెమీ-ఫైనల్స్‌లో సిన్నర్ తో ఫెలిక్స్ అగర్-అలియాసిమ్‌తో తలపడతాడు. మరో సెమీ ఫైనల్లో నోవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ మధ్య జరగనుంది. అంతకముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జిరి లెహెక్కాను అల్కరాజ్ వరుస సెట్లలో ఓడించాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 6-4, 6-2, 6-4 తేడాతో సునాయాసంగా గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ 6-3, 7-5, 3-6, 6-4 తేడాతో ఫ్రిట్జ్ పై నెగ్గాడు.