పిల్లలను కనేందుకు కంపెనీ వినూత్న నిర్ణయం...రాత్రి 8 గంటలకే ఇంటికి

పిల్లలను కనేందుకు కంపెనీ వినూత్న నిర్ణయం...రాత్రి 8 గంటలకే ఇంటికి

జపాన్లో జననాల రేటు ఆందోళనకర రీతిలో పడిపోతోంది.  జపాన్​లో పుట్టిన వారి కన్నా మరణించిన వారి సంఖ్య రెండింతలు ఎక్కువ. 2022లో 8లక్షల కన్నా తక్కువ పిల్లలు  జన్మించగా..1.58 మిలియన్​ మంది మరణించారు. ఈ నేపథ్యంలో జపాన్ లోని ఓ కంపెనీ తీసుకున్న నిర్ణయం అక్కడ జనన రేటు పెరుగుదలకు దోహదపడింది. 

ఒక్క నిర్ణయం..ఫలితంలో తేడా

మసాహిరో ఒకాఫుజీ అనే వ్యక్తి 2010లో ఇటోచు కార్ప్‌కి CEO అయ్యారు. ఆ సమయంలో కంపెనీ ఉత్పాదకతను మెరుగుపర్చడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే లేట్ నైట్ వర్క్ షిఫ్టులను నిషేధించారు. కంపెనీలో రాత్రి 8 గంటల తర్వాత ఎవరు పనిచేయవద్దని ఆదేశించారు. అలాగే ఓవర్ టైం చేసినా వేతనం చెల్లించమని పేర్కొన్నారు. 

పెరిగిన ప్రసూతి సెలవులు..

ఈ నిర్ణయాన్ని ఇటోచు కార్ప్‌ కంపెనీ 2010 నుంచి 2021 వరకు అమలు చేసింది. దీంతో ఇటోచు కార్ప్‌  కంపెనీ ఉద్యోగుల జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. కంపెనీ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగికి లాభం అయింది. ముఖ్యంగా బ్లూమ్‌బెర్గ్ యొక్క నివేదిక ప్రకారం ఇటోచు కంపెనీ నిర్ణయం ఫలితంగా అక్కడి మహిళా ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ప్రసూతి సెలవు తీసుకున్నారు. వారు ఆఫీసులకు రావడమే కాదు..తమ సంసార జీవితాన్ని  సమర్థవంతంగా నిర్వహించారట. దీని ఫలితంగా ఉద్యోగులలో సంతానోత్పత్తి రేటు రెండింతలు పెరిగింది. మార్చి 31 2022 ఆర్థిక సంవత్సరంలో ఒక మహిళా ఉద్యోగికి ఇద్దరు పిల్లలు కలిగి ఉంది. ఇది జపాన్ జాతీయ రేటు 1.3 కంటే చాలా ఎక్కువ అని నివేదిక పేర్కొంది.

ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది..

ఇటోచు కంపెనీ ఉత్పాదకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంటే అది జనన రేటుపై ప్రభావం చూపిందని  ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబయాషి చెప్పారు. జనన  రేటు  పెరుగుదల కోసం ఇటోచు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇటోచు బోర్డు సభ్యుడు అట్సుకో మురాకి దృష్టిని ఆకర్షించింది.  అతను గతంలో జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖలో  ఉపాధి, శిశు సంక్షేమానికి డైరెక్టర్‌గా పనిచేశారు.