
జపాన్ ప్రజలు ఏజ్‌లో సెంచరీ దాటినా హెల్దీగా, యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల పనులు వాళ్లే చేసుకోగలుగుతారు. దీనికి ముఖ్య కారణం.. వాళ్ల లైఫ్‌స్టయిల్, ఆహారపు అలవాట్లు. అందుకే ఆ అలవాట్లను ఇప్పుడు ప్రపంచమంతా అడాప్ట్ చేసుకుంటోంది. ముఖ్యంగా ఇండియాలో జపాన్ ఫుడ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. మెట్రో సిటీల్లో... డెలివరీ మెనూల్లో ‘సూషి రోల్స్’ చేరిపోయాయి. చల్లని సాయంత్రాలను ‘రామెన్ బౌల్స్’ వేడెక్కిస్తున్నాయి. చాయ్ ప్రేమికులను మాచా మచ్చిక చేసుకుంటోంది.
హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్టు... ఒక్కో ప్రాంతం ఒక్కో ఫుడ్‌కి ఫేమస్. అలాంటి ఫేమస్ రెసిపీలన్నీ అక్కడి కల్చర్ నుంచే పుడతాయి. అంటే అక్కడివాళ్ల అలవాట్లు, ఆచారాలు, నమ్మకాలు, లైఫ్‌స్టయిల్, ఆ ప్రాంతంలో పండే పంటలు.. లాంటివన్నీ కలిసి ఆహారపు అలవాట్లను డిసైడ్ చేస్తాయి. అయితే.. ప్రపంచీకరణలో భాగంగా వస్తువులతోపాటు ఆ అలవాట్లు, ఫుడ్ రెసిపీలు కూడా ఇతర దేశాలకు రవాణా అయ్యాయి.
వాటిలో కొన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఉదాహరణకు జపనీస్ సూషి, ఇటాలియన్ పాస్తా, చైనీస్ నూడుల్స్ లాంటివి. కానీ.. జపాన్ ఫుడ్ వెరైటీలు ముఖ్యంగా రామెన్, సూషి, మాచా లాంటివి గడిచిన కొన్నేండ్లలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి. పదేండ్ల క్రితం మన దగ్గర జపనీస్ వంటకాలు లగ్జరీ హోటళ్లు, కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో మాత్రమే దొరికేవి. కానీ.. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
స్ట్రీట్ ఫుడ్ గా..
మన దేశం ఎప్పుడూ ఇతర ఫుడ్ కల్చర్లను స్వాగతిస్తుంది. మొఘలాయి వంటకాలు మొఘలులతో, బేకరీ కల్చర్ బ్రిటిష్ వాళ్లతో వచ్చాయి. ఇండో–చైనీస్ వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఊరిలో చైనీస్ నూడుల్స్ సెంటర్లు చూస్తూనే ఉన్నాం. కానీ.. ఒకప్పుడు మనదగ్గర జపాన్ ఫుడ్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. 2000ల ప్రారంభంలో మన దేశంలో సూషి తినడమంటే పెద్ద సాహసమే. దాన్ని చాలా ప్రమాదకరంగా భావించేవాళ్లు. పచ్చి చేపలు, సోయా సాస్ మనవాళ్లకు చాలా విచిత్రంగా అనిపించేది. కానీ.. ఇప్పుడు పిజ్జా ఆర్డర్ చేసినంత ఈజీగా సూషిని ఆర్డర్ చేస్తున్నారు. జపాన్ రామెన్ కొన్ని సిటీల్లో స్ట్రీట్‌ఫుడ్‌గా మారిపోయింది. దీంతోపాటు మాచా కేఫ్‌లు కూడా పెరుగుతున్నాయి.
అయితే.. ఈ ట్రెండ్ కేవలం కొత్త ఫుడ్ టేస్ట్ చేయాలనే కోరిక వల్ల వచ్చింది కాదు. కరోనా తర్వాత ఇండియన్స్ ఫ్రెష్‌గా ఉండే, తేలికగా జీర్ణమయ్యే, పోషకాలతో కూడిన భోజనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. జపనీస్ ఫుడ్‌కి అలాంటి లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఫ్రెష్ పదార్థాలు వాడతారు. నూనె వాడకం చాలా తక్కువ. డీప్ ఫ్రైయింగ్‌కు బదులు ఆవిరి మీద ఉడికిస్తారు. లేదంటే గ్రిల్ చేస్తారు. పైగా జీర్ణక్రియకు సాయపడే అన్నం, ప్రొటీన్, కూరగాయలు, పులియబెట్టిన పదార్థాలు ఈ వంటలను బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌గా మారుస్తాయి.
జపనీస్ వంటకాలు రుచి, అట్రాక్టివ్ లుక్, ఆరోగ్య ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. పైగా ఇవి స్థానిక ఉత్పత్తులు, పాక సంప్రదాయాలకు అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు.. గుర్గావ్‌లో శాకాహారుల కోసం అవకాడో, క్రిస్పీ వెజిటబుల్ సూషి రోల్స్ చేస్తుంటారు. ఇలాంటివి జపాన్‌లో దొరకవు. బెంగళూరులో సౌత్ ఇండియన్ స్టైల్‌లో రామెన్ తయారుచేస్తున్నారు.
సిటీల్లో ట్రెండింగ్
ఇండియాలో 2019 నుంచి జపనీస్ ఫుడ్ తినేవాళ్ల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు 15 నుంచి 20 శాతం పెరుగుతోందని నివేదికలు చెప్తున్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీల్లో మాత్రమే కాదు. టైర్–2 సిటీల్లో కూడా సూషిల్లాంటివి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. జైపూర్, లక్నో లాంటి సిటీల్లో ప్రత్యేకంగా జపాన్ ఫుడ్ రెస్టారెంట్లు పెడుతున్నారు. డెలివరీ మోడల్స్ డెవలప్ అవుతున్నాయి. ‘డూ–ఇట్– యువర్ సూషి’ కిట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి ఈ వంటకాల్లో వాడే కొన్ని పదార్థాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరికొన్ని కాస్త ఖరీదైనవి. అయినా ప్రజలు తమ ఇళ్లలో సూషి, రామెన్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.
జొమాటో ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం.. 2020 నుంచి 2024 మధ్య జపనీస్ రెస్టారెంట్ లిస్టింగ్‌లు దాదాపు 24 శాతం పెరిగాయి. ఢిల్లీ, బెంగళూరులో తొమ్మిది రెట్లు, ముంబైలో ఎనిమిది రెట్లు పెరిగాయి. పూణె, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలో కూడా జపాన్ ఫుడ్ కల్చర్ చాలా వేగంగా విస్తరిస్తోంది. 2025లో వినియోగదారులు ‘జపనీస్’ వంటకాల ఫిల్టర్‌ను నాలుగు మిలియన్ల సార్లు ఉపయోగించారు. ‘‘సూషి” జొమాటోలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ వంటకంగా పేరు తెచ్చుకుంది. 2024లో అన్ని జపనీస్ వంటకాల ఆర్డర్లలో దాదాపు 30 శాతం ఇదే ఉంది. ర్యామెన్ 16 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఆరోగ్య ప్రయోజనాలు
జపాన్ వంటకాల్లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. సాల్మన్, ట్యూనాలాంటి చేపలు ఎక్కువగా వాడతారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి.మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జపాన్ వంటకాల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పైగా వాటిని పోషకాలు పోకుండా చాలా తక్కువగా కుక్ చేస్తారు. అందుకే వాటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ.
సూషి
ఇది జపనీస్ వంటకాల్లో అత్యంత ప్రసిద్ధమైన వంటకం. కానీ.. దీని పుట్టుకకు మూలాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తుంటారు. పచ్చి చేపలను పులియబెట్టేందుకు అన్నంలో చుట్టే పద్ధతి ఆగ్నేయాసియాలో పుట్టింది. అలా చుట్టడం వల్ల చేప ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది. కావాల్సినప్పుడు చేపని తిని, అన్నం పాడేసేవాళ్లు. కానీ.. ఆ తర్వాత అన్నంతో కలిపి తినడం మొదలుపెట్టారు. ఈ కల్చర్ చివరకు జపాన్‌కు చేరిన తర్వాత అక్కడే ఇప్పుడు మనం తింటున్న సూషి పుట్టింది. సూషితోపాటు తినే ‘వసాబీ’ని నీటిలో పెరిగే ఒక మొక్క వేరు నుంచి తయారుచేస్తారు. సూషిని చుట్టే రేపర్‌ని సీవీడ్(సముద్రపు పాచి)తో చేస్తారు. మన దగ్గర మాత్రం ఎక్కువగా దోసకాయ, గుడ్డు, సోయా రేపర్‌లను వాడుతున్నారు. సాధారణంగా జపాన్‌లో ఫుడ్‌ని చాప్‌స్టిక్స్‌తో తింటారు. కానీ.. సూషిని మాత్రం చేతులతోనే తింటారు.
రామెన్
ఇది ఒక రకమైన జపనీస్ నూడుల్స్ సూప్. ఒకప్పుడు సాధారణ స్ట్రీట్‌ఫుడ్‌గా ఉండేది. కానీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఫుడ్‌గా మారింది. చైనీస్ నూడుల్స్ ఇన్స్పిరేషన్తో జపాన్‌లో దీన్ని తయారుచేశారు. నూడుల్స్‌ని గోధుమ పిండితో చేస్తారు. వాటిని బ్రోత్ అనే సూప్ బేస్‌లో వేస్తారు. ఆ తర్వాత టాపింగ్స్ కోసం వేయించిన కూరగాయలు, మాంసం ముక్కలు, సీవీడ్ షీట్లు లాంటివి వేస్తారు. 1958లో జపాన్‌లో మోమోఫుకు ఆండో అనే వ్యక్తి ఇన్‌స్టంట్ రామెన్‌ను ఆవిష్కరించాడు. ఇది ‘‘నిస్సిన్ చికెన్ రామెన్’’గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని చాలా తక్కువటైంలో తయారుచేసుకోవచ్చు. పైగా హెల్దీగా ఉంటుంది. అందుకే ప్రజాదరణ పొంది ప్రపంచమంతా విస్తరించింది. హైదరాబాద్‌లో రామెన్ అమ్మే స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రామెన్ కల్చర్ టౌన్లకు కూడా విస్తరిస్తోంది.
మాచా
ఇది ఒక రకమైన గ్రీన్ టీ. కాకపోతే.. రైతులు మాచా కోసం గ్రీన్ టీ మొక్కలను నీడలో పెంచుతారు. సూర్యకాంతి లేకపోవడం వల్ల క్లోరోఫిల్ ఉత్పత్తి, అమైనో ఆమ్ల శాతం పెరుగుతుంది. అందుకే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆ ఆకులను మెత్తగా పొడి చేస్తారు. ఇందులో యాంటీ–ఆక్సిడెంట్లు (కాటెచిన్స్ లాంటి పాలీఫెనాల్స్‌తో సహా), ఫైటోకెమికల్స్ (క్లోరోఫిల్, క్వెర్సెటిన్) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మాచా టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి. మాచాని వేడి పాలలో కలిపి ‘లాట్టే’ తయారుచేస్తారు. అంతేకాకుండా ఫ్రూట్ స్మూతీ, సలాడ్ డ్రెస్సింగ్, ఓట్ మీల్, పెరుగులో కలిపి తీసుకుంటారు. పాప్‌కార్న్ మీద చల్లుకోవచ్చు. కుకీలు, బ్రౌనీలు, కప్‌కేక్‌ల లాంటి బేక్డ్ ఫుడ్స్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర చాలా రెస్టారెంట్లలో మాచా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.