మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య..పాలన నచ్చలేదంటూ..

మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య..పాలన నచ్చలేదంటూ..

జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబె హత్యకు గురయ్యారు. ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం షింజో అబే సేవలు అందించారు. 2006లో ఆయన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి 2007వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగారు. ఆ తర్వాత 2012 నుంచి 2020 వరకు ఆయన ప్రధానిగా పనిచేశారు. 2020లో అనారోగ్య సమస్యలతో ఆయన పదవి నుండి వైదొలిగారు.  ఇక షింజోపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

జపాన్ పార్లమెంట్ ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున అబె శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం చేపట్టారు.  ఈ క్రమంలో ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా..ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం వచ్చింది.  అబె భద్రతా సిబ్బంది వెంటనే నాటు తుపాకీ పట్టుకున్న 41 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని నారా నగరానికి చెందిన టెట్సుయా యమగామిగా గుర్తించినట్లు తెలుస్తోంది. యమగామి 2002 నుంచి 2005 వరకు జపాన్ నౌకాదళంలోని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో అతడు నివ్వెరపరిచే విషయాలు చెప్పాడంటూ జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. గతంలో ప్రధానిగా షింజో అబె అందించిన పాలన నచ్చకే .. ఆయనపై కాల్పులు జరిపానని  పోలీసులతో యమగామి చెప్పాడని జపాన్ మీడియా పేర్కొంది.