జపాన్‌లోని ఒక పురాతన ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 1,200 ఏళ్ల నాటి 'ఆరిపోని దీపం' అంటే శాశ్వత జ్వాల ఉన్న ఒక ముఖ్యమైన మండపం పూర్తిగా కాలిపోయింది. వెయ్యి ఏళ్లకు పైగా నిరంతరంగా వెలుగుతూనే ఉందని నమ్మే ఈ పవిత్రమైన దీపం ఉన్న చారిత్రక 'రైకాడో హాల్' ధ్వంసం కావడం జపాన్ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం వల్ల ఆ దేశంలో వందల ఏళ్ల నాటి సంస్కృతి, కట్టడాల రక్షణపై కొత్త చర్చ మొదలైంది.
అసలేం జరిగిందంటే
హిరోషిమా ప్రాంతంలోని మియాజిమా ద్వీపంలో ఉన్న 'దైషో-ఇన్' బౌద్ధ ఆలయ సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పూర్తిగా చెక్కతో కట్టిన రైకాడో హాల్‌ను ఈ మంటలు బూడిద చేశాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న చెట్లకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ జపాన్‌లోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక ప్రదేశం దెబ్బతినడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
ఈ దీపానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే
రైకాడో హాల్‌లో ఉండే ఈ దీపాన్ని 'శాశ్వత జ్వాల' లేదా 'ఆరిపోని అగ్ని' అని పిలుస్తారు. ఆలయ చరిత్ర ప్రకారం.. క్రీస్తుశకం 806లో 'కుకాయ్' అనే ఒక ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి మిసెన్ పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు ఈ దీపాన్ని మొదటిసారి వెలిగించారు. అప్పటి నుంచి ఇది నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. ఈ దీపాన్ని జపాన్ ప్రజలు శాంతికి, నమ్మకానికి చిహ్నంగా భావిస్తారు. గతంలో హిరోషిమాలోని 'శాంతి స్మారక పార్క్'లో శాంతి జ్వాలను వెలిగించడానికి కూడా ఈ దీపం నుంచే నిప్పును తీసుకున్నారు.
అయితే, ఈ పవిత్ర దీపాన్ని మండపానికి కొంచెం దూరంగా వేరే చోట భద్రపరచడం వల్ల అది సురక్షితంగానే ఉందని ఆలయ అధికారులు తెలిపారు. కానీ, ఇంతటి ఆధునిక సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో కూడా వందల ఏళ్ల నాటి చెక్క కట్టడాలు అగ్నిప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జపాన్‌లో శతాబ్దాల నాటి వేలాది చెక్క దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇవి ఆ దేశ సంస్కృతికి, పర్యాటక రంగానికి ఎంతో కీలకం. కానీ ఇవన్నీ భూకంపాలు, తుఫానులు, ముఖ్యంగా అగ్నిప్రమాదాల వల్ల ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటున్నాయి.
చిత్రమేమిటంటే.. ఈ రైకాడో హాల్ గతంలో 2005లో కూడా ఇలాగే అగ్నిప్రమాదానికి గురైంది. ఆ తర్వాత 2006లో దీనిని మళ్లీ నిర్మించారు. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి ఆ పవిత్ర దీపమే కారణమా లేక అక్కడ వాడిన ఇతర పరికరాల వల్ల మంటలు అంటుకున్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పురాతన కట్టడాల రూపాన్ని మార్చకుండా, వాటి ప్రాచీనత దెబ్బతినకుండా ఆధునిక అగ్ని నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే చాలా దేవాలయాలను ఇప్పటికీ పాత పద్ధతిలోనే కేవలం చెక్కతోనే నిర్మిస్తారు.
ఈ 'ఆరిపోని దీపం' కేవలం మతపరమైనది మాత్రమే కాదు, హిరోషిమా నగరానికి ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ సాధించిన శాంతికి ఒక గొప్ప చిహ్నం. ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఎలా కోలుకుందో చెప్పడానికి ఈ దీపమే ఒక నిదర్శనం. అందుకే ఈ ప్రమాదం కేవలం భక్తులను, చరిత్రకారులనే కాకుండా, ఈ పురాతన కట్టడాలను దేశ సంస్కృతికి, చరిత్రకు వారధులుగా భావించే సామాన్య జపాన్ ప్రజలను సైతం తీవ్రంగా బాధించింది.
