
టోక్యో : ఇప్పుడంతా చంద్రుడిపైనే ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. చంద్రుడిపై వివిధ రకాల పరిశోధనలు చేసేందుకు అగ్రదేశాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ మధ్య భారత్ చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జపాన్ దేశం కూడా ఒక అడుగు ముందుకేసి.. లూనార్ మిషన్ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. కానీ.. ఆ దేశానికి టైమ్ కలిసి రావడం లేదు. ప్రయోగం మూడోసారి కూడా వాయిదా పడింది.
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా జపాన్ దేశం మూన్ ల్యాండర్ (Moon Sniper) రాకెట్ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది. అయితే.. ఈ ప్రయోగం మూడోసారి కూడా వాయిదాపడింది. కగోషిమా ప్రిఫెక్చర్‌లోని జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్‌లో ఉన్న యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి సోమవారం (ఆగస్టు 28వ తేదీ) ఉదయం 9 గంటల 26 నిమిషాల సమయంలో హెచ్2-ఏ (H2-A) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. అయితే... ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా (JAXA) వెల్లడించింది.
అమెరికాకు చెందిన నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో చంద్రునిపై రిసెర్చ్ చేసేందుకు స్మార్ట్ ల్యాండర్ లేదా స్లిమ్, లూనార్ ప్రోబ్‌ను జపాన్ దేశం అభివృద్ధి చేసింది. మిషన్ విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను సాఫ్ట్ లాండ్ చేసిన ఐదో దేశంగా జపాన్ చరిత్రలో నిలవనుంది. అయితే.. ప్రయోగించిన 3, 4 నెలల తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. చంద్రయాన్- 3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.