- కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి
- జార్ఖండ్లో పార్టీ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టుల నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని డిప్యూటీ సీఎం, ఏఐసీసీ సీనియర్నేత, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే జార్ఖండ్ వనరులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో జార్ఖండ్ రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, చైతన్యం గల కాంగ్రెస్ కార్యకర్తలు జార్ఖండ్ రాష్ట్రాన్ని, ఇక్కడి వనరులను ఆ దోపిడీదారుల నుంచి కాపాడు కోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాంగఢ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ కు హాజరైన నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. చిత్తార్పూర్ సీ, డీ బ్లాక్ రాజరప్ప బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి.. జార్ఖండ్ ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అలాగే, రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేసి దేశంలో ప్రజాస్వామిక శక్తులను ఏకం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ దేశానికి రెండు సందేశాలు ఇచ్చారని చెప్పారు. విద్వేషాలను రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేం సిద్ధంగా లేమని, విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామని సందేశం ఇచ్చారని వివరించారు. దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలని, కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్టుల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని సందేశం ఇచ్చారని తెలిపారు. కాబట్టి ఈసారి కూడా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. బ్లాక్, గ్రామ, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. రాంగఢ్ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని భట్టి పిలుపునిచ్చారు.