మోదీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లండి :జవదేకర్, తరుణ్ చుగ్

మోదీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లండి :జవదేకర్, తరుణ్ చుగ్

ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలతో జవదేకర్, తరుణ్ చుగ్

హైదరాబాద్, వెలుగు: దేశంలో మోదీ పాలన తీరును, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే పేదలు, మధ్య తరగతి వర్గాలకు జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ జాతీయ నేతలు ప్రకాశ్​జవదేకర్, తరుణ్ చుగ్ సూచించారు. పార్టీ నేతలను, క్యాడర్​ను సమన్వయం చేసుకుంటూనే.. మోదీ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని తెలిపారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని సాగించాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవనే విషయాన్ని జనాలకు వివరించడంలో కీలకంగా వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారు. 

శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో గోవా, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన సుమారు 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో  రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్​చార్జ్​ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, సహ ఇన్​చార్జ్​ అరవింద్ మీనన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వీరంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. 

కాగా, ప్రచారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ.. రాష్ట్రాన్ని ఆరు జోన్ లుగా విభజించింది. ఆయా జోన్లకు ఇతర రాష్ట్రాలకు చెందిన  సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీలను ఇన్​చార్జ్​గా నియమించనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలను ఒక జోన్ గా, నిజామాబాద్, మెదక్ ను మరో  జోన్ గా,  రంగారెడ్డి, మహబూబ్ నగర్ ను ఒక జోన్ గా, నల్గొండ , ఖమ్మం ను ఇంకో జోన్ గా, వరంగల్, కొత్తగూడెం జిల్లా ఒక జోన్ గా, గ్రేటర్ పరిధిలోని జిల్లాలన్నింటిని ప్రత్యేక జోన్ గా విభజించారు.