
దుబ్బాక, వెలుగు: కబ్జాకు గురైన తమ భూమిని కాపాడాలంటూ ఓ జవాన్ చేసిన వీడియో వైరల్ అయింది. తన కుటుంబానికి చెందిన 1.16 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరుపై చూపిస్తున్నదని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని భారత్ సరిహద్దు నుంచి తన భూ సమస్యను వివరిస్తూ జవాన్ రామస్వామి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది.
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట, భూంపల్లి మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన బూరు శామవ్వ, వెంకటయ్య దంపతుల పెద్ద కుమారుడు రామస్వామి ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. చౌదర్‌పల్లిలోని 406 సర్వే నంబర్‌లో 3.09 ఎకరాల భూమి ఉంది. అందులో 1.33 ఎకరాలు వారసత్వంగా గౌరయ్య, వెంకటయ్య, రవి, రమేశ్(వీఆర్వో), నరేశ్ పేర్లపై రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది.
మిగతా 1.66 ఎకరాలు బూరు ఎల్లయ్య (జవాన్ రామస్వామి తాత తల్లి తరఫు) 1997లో కొనుగోలు చేసి సాదా బైనామా చేశారు. ఈ క్రమంలో రామస్వామి తల్లి బూరు శామవ్వ, తండ్రి వెంకటయ్య దంపతులు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. వెంకటయ్య గల్ఫ్‌కు వలస వెళ్లడంతో భూమి రిజిస్ట్రేషన్ విషయం మర్చిపోయారు. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తేవడంతో రామస్వామి ఫ్యామిలీకి చెందిన భూమిని రమేశ్(వీఆర్వో) అన్నదమ్ముల పేరిట నమోదు చేసుకున్నారు.
తమకు రైతు బంధు రాకపోవడంతో జవాన్ రామస్వామి ఆరా తీయగా, తమ భూమి పక్కనే ఉన్న రమేశ్(వీఆర్వో) అన్నదమ్ముల పేరిట 1.16 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డులు మార్చినట్లు గుర్తించారు. దీంతో రామస్వామి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జవాన్ రామస్వామి.. శనివారం తన సమస్యను వివరిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ స్పందించి.. జవాన్‌కు న్యాయం చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్, ఆర్‌ఐ చౌదర్‌పల్లికి వెళ్లి, జవాన్ ఫ్యామిలీకి సంబంధించిన భూమిని పరిశీలించారు.