వాహనదారుల బండ్లను ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీయడం ప్రస్తుతం ఆధునిక విపరిణామంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలలో తీవ్ర అసహనం పెరిగిపోతోందన్న చర్చ నడుస్తోంది. వాహనదారులను ఎక్కడపడితే అక్కడ ఆపడం, బండి తాళాలు తీసుకోవడం, ప్రజల విధులకు ఆటంకాలు కలిగించడం మొదలైన ట్రాఫిక్ పోలీసుల తీరుపట్ల విస్మయం కలుగుతోంది అని చెప్పుకోవచ్చు.
మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తుంటే ట్రాఫిక్‌ను ఆపి దారి ఇచ్చే ట్రాఫిక్ పోలీసులు సామాన్య పేద, మధ్య తరగతి ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ప్రజల ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకులకు వర్తించవా? ఈ ప్రశ్నకు పాలకులే సమాధానం చెప్పాలి. ఇప్పటికే అతుకుల గతుకుల మయంగా ఉన్న రహదారుల మీద బండి నడపాలంటేనే సామాన్యులు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారు.
వాహనదారుల నుంచి బండి తాళాలు తీసుకోవడం అనేది ఆర్టికల్ 21 (జీవించే హక్కు )కి విరుద్ధం. దీనిపై న్యాయస్థానాలు కూడా స్పష్టతనిచ్చాయి. ట్రాఫిక్ పోలీసులు అసలు తమ విధులు ఏంటో కూడా తాము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దయచేసి ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టకుండా హైకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం వెళ్లాలని, లేనియెడల కోర్టు ధిక్కారంతోపాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదం ఉంది అని అధికారులు తెలుసుకుంటే మంచిది.
- జయసాగర్ రెడ్డి బండి, LLB
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
