పంటల విలువ పెంపుతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌.. రైతుల ఆదాయం పెరగాలంటే ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి

పంటల విలువ పెంపుతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌.. రైతుల ఆదాయం పెరగాలంటే ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి
  •      మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     జయశంకర్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ వర్సిటీలో 62వ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్, వెలుగు : ‘పంటల విలువ పెంచడంతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది, రైతుల ఆదాయం పెరగాలంటే ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 

ప్రొఫెసక్‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం వర్సిటీ ఆడిటోరియంలో ‘భారత హరిత విప్లవానికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అద్భుత సేవలు’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 1964లో ఏర్పాటైన వర్సిటీ ఆరు దశాబ్దాలుగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందన్నారు. 

1966లో వర్సిటీ భవనాలను ఇందిరా గాంధీ ప్రారంభించడం సంస్థ చరిత్రలో గర్వకారణమన్నారు. 1960లో దేశం ఎదుర్కొన్న ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి ఇందిరా గాంధీ నాయకత్వంలో ఎంఎస్‌‌‌‌‌‌‌‌.స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ వంటి సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌ల కృషి హరిత విప్లవానికి దారితీసిందన్నారు. దాని ఫలితంగానే ఆహార ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 

ప్రపంచం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ వైపు అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా అదే దిశలో ముందుకు  సాగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో కార్బన్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్‌‌‌‌‌‌‌‌ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయవనరులుగా మారనున్నాయన్నారు. 

తెలంగాణను దేశ వ్యవసాయ దిక్సూచిగా నిలబెట్టడంలో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ వర్సిటీ కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఆరు దశాబ్దాల్లో యూనివర్సిటీ 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని చెప్పారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోదండరెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, జస్టిస్​బి.సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ మధుర స్వామినాథన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, వీసీలు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్ పాల్గొన్నారు.