మోరంచపల్లిలో కేంద్ర బృందం పర్యటన.. వరద నష్టంపై అంచనా

మోరంచపల్లిలో కేంద్ర బృందం పర్యటన.. వరద నష్టంపై అంచనా

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేటీపీపీ గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర బృంద సభ్యులు. మోరంచపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లి.. వరద బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన గడ్డం మహాలక్ష్మి, గంగిడి సరోజన, గొర్రె ఒదిరెడ్డి వజ్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరద ప్రభావంతో కొట్టుకుపోయిన మోరంచపల్లిలోని బ్రిడ్జి, తెగిపోయిన రోడ్లు, ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. తాగటానికి నీళ్లు లేవని కేంద్ర బృందం ముందు వరద బాధితులు ఏ కరువు పెట్టారు. 

భారీ వర్షాలకు నిన్న, మొన్నటి వరకు మోరంచపల్లిలో ఎటు చూసినా పారిశుధ్య లోపమే కన్పించింది. ఎక్కడికక్కడ చెత్త, బురద పేరుకుపోవడంతో విషజ్వరాలు, అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. పారిశుధ్య సిబ్బంది రంగంలోకి దిగి క్లీనింగ్‌ పనులు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు.

మోరంచపల్లిలో ప్రస్తుత పరిస్థితులు బాగా లేకపోవడంతో కొందరు గ్రామస్తులు తమ బంధువుల ఇండ్లకు వెళ్లారు. బుధవారం రాత్రి వచ్చిన వరద భయం గ్రామస్తులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రమాదాన్ని తలచుకొని కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లారు.