జయశంకర్భూపాలపల్లి, వెలుగు : జిల్లా పరిధిలో ప్రమాదకరంగా జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. శనివారం ఆయన ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి పోలీస్, రవాణా, ఆర్అండ్బీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
రహదారులపై పశువుల సంచారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పెట్రోలింగ్, అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అన్ని సంక్షేమ శాఖల వసతి గృహాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.
