- జయత్రి ఇన్‌ఫ్రా బాధితుల ఆవేదన
- న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
పంజాగుట్ట, వెలుగు: జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, శ్రీనివాస్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాట్ల పేరుతో తమను నమ్మించి రూ. 300 కోట్లు మోసం చేశాయని బాధితులు వాపోయారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులు మాట్లాడారు. శ్రీనివాస్ కాకర్ల అనే వ్యక్తి మరో 29 మంది డైరెక్టర్లతో కలిసి కూకట్‌పల్లి, కేపీహెబ్బీ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసి, సుమారు 500 మంది నుంచి నెలవారీ వాయిదాల రూపంలో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేశారని ఆరోపించారు. ఇప్పుడు ఇదే ముఠా వైజాగ్లో కొత్త కార్యాలయం తెరిచి మరో మోసానికి సిద్ధమవుతోందన్నారు.
ఈ ముఠాతో అధికారులు చేతులు కలిపి నిందితులను రక్షిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిపాజిట్లు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో బాధితులు శ్రీనివాస్ మూర్తి, ప్రభాకర్, గంగేశ్వర్, హరినాథ్ బాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
