సంక్రాంతికి JBS- MGBS మెట్రో

సంక్రాంతికి JBS- MGBS మెట్రో

సంక్రాంతికి అందుబాటులోకి కారిడార్‌-2
15 కి.మీ. మార్గంలో 9.68 కి.మీ.పనులు పూర్తి

ఈ రూట్​లో మెట్రో సేవలు సంక్రాంతికి అందుబాటులోకి రానున్నాయి. ట్రయల్ రన్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా స్టేషన్లు, లైన్లలో విద్యుత్‌, ఇతర మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పండుగ నాటికి పనులు పూర్తి చేయనున్నారు.

హైదరాబాద్‌, వెలుగు: కారిడార్‌–2లో జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకూ మెట్రో సేవలు అందుబాటులోకి తేవాలని మొదట భావించారు. అయితే స్థానిక ఆటంకాల కారణంగా ఇది వెనక్కి పోగా.. కారిడార్‌ -3( నాగోల్‌ –- రాయదుర్గ్‌) మెట్రోను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం నాగోల్‌ -– మియాపూర్‌, ఎల్‌బీనగర్‌– -మియాపూర్‌, రాయదుర్గ్‌ రూట్లలో రోజూ సుమారు4 లక్షల మందికి పైగా సేవలందిస్తోంది. ఆ తర్వాత కారిడార్​ 2 పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకూ పనులు పూర్తి చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకూ స్థానిక రాజకీయ కారణాలతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ముందుగా ఈ లైన్‌లోని 9.68 కిలోమీటర్ల పరిధిలో 10 మెట్రో స్టేషన్లలో పనులు పూర్తి చేశారు. మిగిలిన 5.36 కిలోమీటర్ల మెట్రో సేవలను ఈ ఏడాది అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్‌ ఇటీవల హామీఇచ్చారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మధ్య 2019 డిసెంబర్‌లో మెట్రో ట్రయల్‌ రన్స్‌ ప్రారంభించారు.

జేబీఎస్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ హాస్పిటల్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్ల నిర్మాణంలో భాగంగా బోర్డుల ఏర్పాటు, సిమెంట్‌ ఫినిషింగ్‌, టికెట్‌ కౌంటర్ల వరకూ దారుల అనుసంధానం పనులు నడుస్తున్నాయి. వీటితో పాటు మెట్రో లైన్లలో ఎలక్ట్రిక్‌, విద్యుత్‌ దీపాల ఏర్పాటు పనులు చేస్తున్నారు. ఈ నెల 15 నాటికి అన్ని పనులు పూర్తి చేసి మెట్రోకు అప్పగించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కారిడార్‌ –2లో భాగంగా ఈ లైన్‌ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రాజెక్టులో మెజారిటీ భాగం అందుబాటులోకి వస్తుంది. 15 కిలోమీటర్ల ఈ రూట్‌ పనుల్లో 9.68 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుబాటులోకి వస్తుంది. పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద బ్లూలైన్‌ ( నాగోల్‌–- రాయదుర్గ్‌) కనెక్టివిటీ, ఎంజీబీఎస్‌ వద్ద రెడ్‌లైన్‌ (ఎల్బీనగర్‌– -మియాపూర్‌) లైన్‌ తో కనెక్టవిటీ ఏర్పాటు చేస్తారు. దీంతో నగరంలోని మెట్రో విస్తరించిన అన్ని రూట్లలో సేవలు వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా జిల్లాల నుంచి బస్సుల్లో జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లకు చేరుకునే వారందరూ మెట్రో సర్వీసుల్లో ట్రాఫిక్‌ను తప్పించుకోవడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది.