జేబీఎస్​-ఎంజీబీఎస్ మెట్రో వస్తోంది

జేబీఎస్​-ఎంజీబీఎస్ మెట్రో వస్తోంది

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ లో మరో ముందడుగు పడింది. కారిడార్–2 పనులను మెట్రో అధికారులు వేగవంతం చేశారు. వచ్చే నవంబర్ నాటికి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రూట్ లో ప్రధానమైన విద్యుత్ సరఫరా పనులను భారత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్​స్పెక్టర్ డీవీఎస్ రాజు శుక్రవారం పరిశీలించారు.

హైదరాబాద్ మెట్రోలో రెండో కారిడార్ జేబీఎస్ టూ ఫలక్ నుమా15 కి.మీ మార్గంలో ఎంజీబీఎస్ వరకు 10 కిలో మీటర్ల రూట్ ను నవంబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు పనులు ముమ్మరం చేశారు.  ఈ రూట్ ను భారత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్​స్పెక్టర్  డీవీఎస్ రాజు పరిశీలించారు. జేబీఎస్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు ఉన్న మూడు స్టేషన్లలో ఆక్జిలరీ సబ్ స్టేషన్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించి, విద్యుత్ పనులను తనిఖీ చేశారు.

ట్రాక్​ పనులు పూర్తి

ఈ ప్రాజెక్ట్ లో  మిగిలిన కారిడార్–2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్  10 కిలో మీటర్ల మార్గాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మెట్రో అధికారులు పనుల్లో వేగం పెంచారు. అన్ని అనుకున్నట్టు జరిగితే నవంబర్ లో ఈ మార్గం లో మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ కారిడార్ లో  ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రికల్ పనులపై దృష్టి సారించారు. జేబీఎస్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు మూడు మెట్రో స్టేషన్లలో విద్యుత్ కోసం ఆక్జిలరీ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. విద్యుత్ పనులను  చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్​స్పెక్టర్ డీవీఎస్ రాజు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  రైలు సేవలకు ప్రధానమైన సిగ్నలింగ్, టెలీ కమ్యునికేషన్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ వంటి పనులకు అనుమతి లభించాల్సి ఉందని మెట్రో అధికారులు తెలిపారు. వీటన్నింటికి క్లియరెన్స్ వస్తే దాదాపు ఈ రూట్ లో టెక్నికల్ పనులు పూర్తయినట్టే. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో పరుగులు పెట్టనుంది. మరోవైపు  ఎంజీబీఎస్ నుంచి  ఫలక్ నుమా వరకు మెట్రో  సాధ్యాసాధ్యాలపై స్పష్టత లేదు.  జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో అందుబాటులోకి వస్తే  మెట్రో మొదటి దశ  పూర్తయినట్టే.

ఇప్పటికే రెండు రూట్లలో సేవలు

ఇప్పటికే 56 కి.మీ మేర సేవలందిస్తున్న మెట్రోను మరో 10 కిలో మీటర్ల మేర విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కారిడార్–1 నాగోల్ నుంచి హైటెక్ సిటీ 27 కిలో మీటర్లు, కారిడార్​–3 ఎల్బీనగర్​ నంచి మియాపూర్  29 కిలో మీటర్లు మేర  మెట్రోసేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.  మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 2.80 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది.