మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ ... ఎందుకంటే...

మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ ... ఎందుకంటే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్  ప్రయత్నించారు. జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేడీ అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

లక్ష్మీనారాయణ(VV Lakshminarayana) మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోందని, ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం, వైసీపీ  ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయని అన్నారు.


 తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి రాలేదని, ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడుదాం రండి అని చెప్పడానికే వచ్చామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.  ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు, భావితరాలకు మనమందరం మార్గదర్శకులుగా ఉందాం అని అన్నారు.ఈ ముట్టడి కార్యక్రమంలో లక్ష్మీనారాయణతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.