నా భార్య ఉషా క్రిస్టియన్ కాదు.. ఆమె మతం మారట్లేదు: జేడీ వాన్స్ క్లారిటీ

నా భార్య ఉషా  క్రిస్టియన్ కాదు.. ఆమె మతం మారట్లేదు: జేడీ వాన్స్ క్లారిటీ

వాషింగ్టన్: హిందూ మతంలో పెరిగిన తన భార్య ఉష ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మత విశ్వాసాల విషయంలో జేడీ వాన్స్ ద్వంద వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ-అమెరికన్లు జేడీ వాన్స్‎ది కపటత్వమని విమర్శిస్తున్నారు. తన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీయడంతో జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చాడు. తన భార్య ఉషా క్రైస్తవురాలు కాదని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని వివరణ ఇచ్చాడు.

తన భార్య మతాన్ని కించపర్చానని వస్తోన్న విమర్శలు అసహ్యకరమైనవని తీవ్రంగా ఖండించారు. తనపై వస్తున్న విమర్శలు అసహ్యకరమైనవని ఆగ్రహం వ్యక్తం చేసిన వాన్స్.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శకులపై ఎదురు దాడి చేశారు. తాను ప్రజల మనిషినని.. వాళ్లు వేసే ప్రశ్నల నుంచి తప్పించుకోకుండా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతమని.. ఈ అంశం కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిందని పేర్కొన్నారు.

 సాధారణంగా క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు.. ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. ఇందులో భాగంగానే ఒక క్రిస్టియన్‎గా.. నా భార్య కూడా క్రైస్తవ మతం స్వీకరించాలని కోరుకుంటున్నానని కామెంట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. కానీ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకుని.. నేను ఆమె మతాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదన్నారు. నా భార్య అంటే నాకు ఎంతో ప్రేమ అని.. ఆమె మతాన్ని కూడా గౌరవిస్తానని పేర్కొన్నాడు. 

కాగా, ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్‌లో జేడీ వాన్స్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత మూలాలున్న ఓ యువతి ఆయన భార్య ఉషా మతం గురించి జేడీ వాన్స్‎ను ప్రశ్నించింది. దానికి వాన్స్‌ స్పందిస్తూ.. హిందూ మతంలో పెరిగిన తన భార్య ఉష ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మత విశ్వాసలపై వాన్స్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. 

ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి  ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్‌ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు. 

జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అన్నది తెలిసిన విషయమే. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మి చిలుకురి 1970లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. క్రిష్ చిలుకురి శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్‌గా కాగా.. ఉషా తల్లి లక్ష్మీ చిలుకురి మాలిక్యులర్ బయాలజీ విభాగంలో టీచింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సిక్స్త్ కాలేజీకి ప్రోవోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇక.. ఉషా, జెడీ వాన్స్‎ యేల్ లా స్కూల్‏లో చదువుకుంటున్నప్పుడు ఒకరికొకరు పరిచమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి హిందు సంప్రాదాయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది అయిన ఉషా వాన్స్ యూఎస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జి రాబర్ట్స్‎ దగ్గర క్లర్క్‎గా పనిచేశారు. తాజాగా జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలతో ఉషా వాన్స్ మరోసారి వార్తల్లో నిలిచారు.