
- వర్షం మాటున ప్రమాదకర వ్యర్థ జలాల డంపింగ్
- ఈసారి ఏకంగా డ్రమ్ములతోనే..
- ఘాటైన వాసనలు, పొగలతో ఉక్కిరిబిక్కిరి
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ఏరియాలోని నాలాలు శుక్రవారం ఎరుపెక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు వర్షాన్ని ఆసరాగా చేసుకుని వ్యర్థ రసాయనాలు కలపడంతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ నాలాలు ఎర్ర రంగులో కనిపించాయి. జీడిమెట్ల, ఎస్వీ కోపరేటివ్సొసైటీ ఇండస్ట్రియల్ఏరియాలోని కొన్ని కంపెనీలు, కెమికల్మాఫియా చేతులు కలిపి మూడు రోజులుగా వర్షం మాటున పెద్ద ఎత్తున ప్రమాదకర వ్యర్థ రసాయనాలను నాలాలో డంప్చేస్తున్నాయి.
ప్రతిసారీ ఈ పని చేస్తున్నా ఈసారి బరి తెగించి ఏకంగా కెమికల్డ్రమ్ములనే తీసుకువచ్చి పడేశారు. ఆ డ్రమ్ముల్లోంచి పొగలు వస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గంపల బస్తీ వాసులైతే ఘాటైన వాసనలు, పొగలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఏం చేయాలి? ఏం చేస్తున్నారు?
సాధారణంగా కంపెనీల్లో ప్రొడక్షన్తర్వాత వెలువడే ప్రమాదకర వ్యర్థ రసాయనాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు తరలించాలి. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొన్ని పరిశ్రమల యజమానులు నాలాల్లోకి డంప్‌చేస్తున్నారు. సాధారణ సమయాల్లో ట్యాంకర్ల ద్వారా ఖాళీ ప్రదేశాల్లో డంప్చేస్తుండగా, వర్షాకాలంలో నాలాలను వాడుకుంటున్నారు. కొందరైతే డైరెక్ట్‌గా పైపు లైన్లు వేసి రసాయనాలను వదులుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.