జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం..ప్రింటింగ్ కంపెనీలో ఎగిసిన మంటలు

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం..ప్రింటింగ్ కంపెనీలో ఎగిసిన మంటలు

జీడిమెట్ల, వెలుగు: ఓ పాలిమర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జీడిమెట్ల, దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి క్రౌన్ పాలిమర్స్ పేరుతో ప్లాస్టిక్ సంచులపై పేర్లు ముద్రించే కంపెనీని నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 20 మంది కార్మికులు కంపెనీలో పనిచేస్తుండగా ఒక్కసారిగా మెషీన్​ నుంచి మంటలు చెలరేగాయి. 

కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కంపెనీలో ప్రింటింగ్ కు సంబంధించిన కెమికల్స్ ఎక్కువగా ఉండడంతో పాటు యంత్రాలు నడపడానికి తెచ్చిన డీజిల్ డబ్బాలకు మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిశాయి. 

మరో మూడు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అయినప్పటికీ రాత్రి 10:15 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు.  మూడంతస్తుల భవనంలో ఈ పరిశ్రమ నడుస్తుండగా, మొదటి అంతస్తులోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.