- రాజ్యాంగానికి తూట్లు పొడిచి పార్టీలోకి వచ్చినొళ్లు మాకు బోధించాలా?
- ఎమ్మెల్యే సంజయ్‌పై పరోక్షంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
జగిత్యాల, వెలుగు: “నేను కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల హక్కుల కోసం పోరాడుతున్నాను. మాకు ఎవరైనా అడ్డం వస్తే నరుకుతాం. ధర్మాన్ని నమ్ముకున్న రాముడే రావణుడి పది తలలు నరికాడు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి పార్టీలోకి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత లేదు. నువ్వు ఎంత ఒక తలకాయ?”అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జరిగిన పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదని, పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకే టికెట్లు ఉంటాయని అన్నారు. కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమన్నారు.
స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే సహించబోమని, అలాంటి ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులని చెప్పిన ఆయన, జగిత్యాల మున్సిపల్‌పై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ కాంగ్రెస్ జెండా పట్టని వారు వచ్చి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు వెంకట్ స్వామి పాల్గొన్నారు.
