
జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, అసమర్థతే కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో ఆమె విఫలం అయ్యిందని అందుకే ప్రజలు కవితను ఓడించారని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్ముక్కయ్యారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు.
ఒకవేళ నిజంగా కాంగ్రెస్ , బీజేపీ కలిసి కుమ్మక్కైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మీ ఓటు బ్యాంక్ ఎటు పోయింది ? అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఓటు బ్యాంక్ కాపాడుకోలేని అసమర్థత టీఆరెస్ పార్టీది, ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలది అని జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి కూడా పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడిందన్నారు.
టీఆర్ఎస్ నాయకులు ఇకనైనా వాస్తవాలు గ్రహించి , తమ పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని చురకలంటిచ్చారు జీవన్. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు ఇకనైనా అనవసర విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. ఎంపీగా గెలిచిన అరవింద్ కూడా పసుపుబోర్డు ఏర్పాటుపై ఇచ్చిన హామీని ఒక నినాదంగా కాకుండా హామీ అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు జీవన్ రెడ్డి.
