హుజురాబాద్ లో తప్ప ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎక్కడ లేవు

హుజురాబాద్ లో తప్ప ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎక్కడ లేవు

టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఓవైపు చెబుతూనే... ఇంకోవైపు వరి వేస్తే ఉరే అంటున్న ఈ సర్కారు మాటలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.జగిత్యాల జిల్లానే ఓ ఉదాహరణ తీసుకుంటే... ఈ జిల్లా ఖరీఫ్ ప్రణాళిక 1266 కోట్లు.. ఖర్చు చేసింది కేవలం 606 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. అంటే 48 శాతం మాత్రమే ఖర్చు చేశారన్నారు.

రబీ ప్రణాళికను సమీక్షించాల్సింది పోయి... ఖరీఫ్ ముగిశాక ఇక్కడి జిల్లా కలెక్టర్ ఖరీఫ్ రుణ ప్రణాళిక అమలును సమీక్షిస్తుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటివరకూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క హుజురాబాద్ లో తప్ప.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా ప్రారంభమే కాలేదన్నారు. ఇక ఇప్పుడక్కడ కూడా బందు పెడ్తారు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లాలో సన్నవరి ధాన్యం పండిస్తే.. వాటిని కొనుగోలు కేంద్రాలేర్పాటు చేయకపోవడంతో మిల్లర్లు 1600 కు కొనే పరిస్థితిని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ప్రతీ క్వింటాపై రైతు 300 రూపాయల చొప్పన.. ఎకరాకు 30 క్వింటాళ్లు వస్తే 9 వేల రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు. మొక్కజొన్నకు, పసుపు దినుసులకు, నూనెగింజలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు  మార్క్ ఫెడ్ ద్వారా ధాన్యం సేకరణ కేంద్రాల్లో రంగంలోకి దించితే రైతుకు కనీస మద్దతు స్థిరీకరించబడే అవకాశముంటుందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు మొన్నటి శాసనమండలి సమావేశాల్లోనూ నేను మూతబడ్డ చక్కెర పరిశ్రమల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించానని తెలిపారు జీవన్ రెడ్డి.