
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లోకల్ స్టార్ జెస్సికా పెగులా వరుసగా రెండోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గత మ్యాచ్‌లో ఎనిమిది మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని ఔరా అనిపించిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బొరా క్రెజికోవాను వరుస సెట్లలో ఓడించి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ పెగులా 6–3, 6–3తో క్రెజికోవాను ఓడించింది. గత సీజన్ రన్నరప్ అయిన జెస్సికా ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. మ్యాచ్ మొత్తంలో 4 బ్రేక్ పాయింట్లు, 10 నెట్ పాయింట్లు, 7 విన్నర్లతో అదరగొట్టింది. ఒకే ఏస్ కొట్టిన తను నాలుగు డబుల్ ఫాల్ట్స్, 20 అనవసర తప్పిదాలు మాత్రమే చేసింది. మరోవైపు 3 ఏస్‌లు కొట్టినా.. ఏడు డబుల్ ఫాల్ట్స్, 23 అనవసర తప్పిదాలు చేసిన క్రెజికోవా రెండే బ్రేక్ పాయింట్లు సాధించింది.
కోకోకు ఒసాకా చెక్
మాజీ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ నవోమి ఒసాకా అద్భుత ఆటతో టైటిల్ ఫేవరెట్, లోకల్ ప్లేయర్ కోకో గాఫ్‌కు చెక్ పెట్టింది. దాంతో 2021 తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 23వ సీడ్ ఒసాకా (జపాన్) 6-–-3, 6--–2 తో మూడో సీడ్ గాఫ్‌పై వరుస సెట్లలో విజయం సాధించింది. క్వార్టర్స్‌లో తను చెక్ రిపబ్లిక్‌కు చెందిన 11వ సీడ్ కరోలినా ముచోవాతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో ముచోవా (చెక్) 6–3, 6–7 (0/7), 6–3తో కోస్త్యూక్ (ఉక్రెయిన్)పై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో పోలాండ్ స్టార్, రెండో సీడ్ స్వైటెక్ 6–--3, 6--–1తో ఎకతరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించగా, 8వ సీడ్ అనిసిమోవా 6-–0, 6-–3తో బీట్రిజ్ హదాద్ (బ్రెజిల్)పై గెలిచింది. విమెన్స్ డబుల్స్‌లో లెజెండరీ ప్లేయర్ వీనస్ విలియమ్స్, కెనడా ప్లేయర్ లైలా ఫెర్నాండెజ్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రి క్వార్టర్స్‌లో 6--–3, 6--–4తో 12వ సీడ్ ఎకతరీనా–- జాంగ్ షువై ద్వయాన్ని ఓడించింది.
సినర్ 81 నిమిషాల్లోనే
మెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ యానిక్ సినర్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కజకిస్తాన్ ప్లేయర్ అలెగ్జాండర్ బబ్లిక్‌ను కేవలం 81 నిమిషాల్లోనే చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ సినర్ 6–-1, 6–-1, 6–-1 తో బబ్లిక్‌ను మట్టికరిపించాడు. ఈ టోర్నమెంట్ హిస్టరీలో సెకండ్ ఫాస్టెస్ట్ మ్యాచ్‌గా నిలిచిన ఈ పోరులో ఆరంభం నుంచి చివరి వరకు సినర్ అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 8 ఏస్‌లు, 8 బ్రేక్ పాయింట్లు, 10 నెట్ పాయింట్లు, 24 విన్నర్లతో విజృంభించాడు. ఒక డబుల్ ఫాల్ట్, 16 అనవసర తప్పిదాలు మాత్రమే చేశాడు. యానిక్ ధాటికి బబ్లిక్ నిలవలేకపోయాడు. అతను ఏకంగా 13 డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. చివరి మ్యాచ్ పాయింట్‌ను కూడా డబుల్ ఫాల్ట్‌తోనే సినర్‌కు అప్పగించాడు. గత 52 వారాల్లో కార్లోస్ అల్కరాజ్ కాకుండా సినర్‌ను ఓడించిన ఏకైక ప్లేయర్ బబ్లిక్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా వరుసగా 11 మ్యాచ్‌ల విజయ పరంపరతో బబ్లిక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో 55 సర్వీస్ గేమ్‌లను కాపాడుకున్న అతని రికార్డుకు సినర్ ఆట తొలి గేమ్‌లోనే తెరదించాడు. బబ్లిక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఇటలీ స్టార్, ఏ దశలోనూ అతనికి అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లాడు. డ్రాప్ షాట్లు, అండర్ హ్యాండ్ సర్వ్‌లతో సహా బబ్లిక్ తన అస్త్రాలన్నింటినీ ప్రయోగించినా సినర్ దాడిని అడ్డుకోలేకపోయాడు. హార్డ్ కోర్టు గ్రాండ్‌స్లామ్స్‌లో సినర్‌కు ఇది వరుసగా 25వ విజయం కావడం విశేషం. సినర్ క్వార్టర్ ఫైనల్లో ఇటలీకే చెందిన 10వ సీడ్ లొరెంజో ముసెట్టితో తలపడతాడు. ముసెట్టి 6–3, 6–0, 6–1తో స్పెయిన్ ప్లేయర్ మునార్‌ను ఓడించగా.. 25వ సీడ్ ఫెలిక్స్ ఆలియాసిమ్ - (కెనడా) 7–-5, 6–-3, 6–-4తో 15వ సీడ్ ఆండ్రీ రబ్లెవ్ (రష్యా) ను ఓడించి సంచలనం సృష్టించాడు.