హైదరాబాద్, వెలుగు: జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ 18వ ఎడిషన్ మే 8 నుంచి 10 వరకు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా, హెచ్‌జేఎంఏ దీనిని నిర్వహిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బీ2బీ జ్యువెలరీ ప్రదర్శనగా ఇది గుర్తింపు పొందింది.
తొలిసారిగా జ్యువెలరీ రిటైల్ సింపోజియం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జాతీయ స్థాయి ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ముంబై జవేరీ బజార్ తయారీదారులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసన్ జోన్ ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దృష్ట్యా కొత్త కలెక్షన్లు సేకరించడానికి రిటైలర్లకు ఇది మంచి అవకాశం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తారని భావిస్తున్నారు. బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లతో పాటు జ్యువెలరీ టెక్నాలజీకి సంబంధించిన వివిధ బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరుతాయి.

