నేను సీఎంను.. దేశం విడిచి పారిపోతనా? : హేమంత్ సోరెన్

నేను సీఎంను.. దేశం విడిచి పారిపోతనా? : హేమంత్ సోరెన్

ఈడీ పదే పదే సమన్లు జారీ చేస్తోంది : సోరెన్ 
మైనింగ్ కేసులో విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం  

రాంచీ : అక్రమ మైనింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పదే పదే సమన్లు జారీ చేస్తోందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మండిపడ్డారు. గురువారం ఆయన రాంచీలోని ఈడీ రీజినల్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆయనను 6 గంటల పాటు ప్రశ్నించింది. అంతకుముందు సోరెన్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను సీఎంను. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను. కానీ నేనేదో దేశం విడిచి పారిపోతానన్నట్లుగా ఈడీ సమన్లు ఇస్తోంది. వ్యాపారవేత్తలు మినహా రాజకీయ నేతలెవరూ ఇప్పటి వరకు దేశం వదిలి పారిపోలేదు” అని అన్నారు. ‘‘నాపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఒక సీఎంపై ఇంత తేలికగా ఇంత పెద్ద ఆరోపణలు చేస్తరా?” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 

వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందా? 

రూ.వెయ్యి కోట్ల మైనింగ్ స్కామ్ జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొనగా, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని సోరెన్ మండిపడ్డారు. ఈ మేరకు ఈడీకి ఆయన లెటర్ రాశారు. ‘‘వెయ్యి కోట్ల స్కామ్ జరగాలంటే లీగల్ మైనింగ్ కు 4 రెట్ల మైనింగ్ జరిగి ఉండాలి. ఆ మొత్తాన్ని తరలించాలంటే 20 వేల రైల్వే ర్యాకులు  లేదా 33 లక్షల ట్రక్కులు కావాలి. డాక్యుమెంట్లు లేకుండా రైల్వే రవాణా చేస్తుందా? పోనీ అన్ని ట్రక్కులు, క్రషర్లు, ఇతర మిషనరీ ఎక్కడుంది? వీటిని పరిగణించరా?” అని లేఖలో ప్రశ్నించారు.