మా డీఎన్ఏలో భయానికి చోటేలేదు

మా డీఎన్ఏలో భయానికి చోటేలేదు

రాంచీ: గిరిజనల డీఎన్ఏలో భయానికి  చోటు లేదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. తానొక  గిరిజన బిడ్డనని.. శత్రువులకు భయపడే  ప్రసక్తే లేదన్నారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా లొంగేది లేదన్నారు. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాని తేల్చి చెప్పారు. తమ పూర్వీకులు తమలోని  భయాన్ని ఏనాడో పారదోలారని అన్నారు. మరోవైపు వరుసగా రెండో రోజు అధికార కూటమి ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు  రాంచీలోని  తన నివాసంలో ఆయన సమావేశం  కానున్నారు. 

కాగా.. హేమంత్ సోరెన్  శాసన సభ  సభ్యత్వంపై  సందిగ్ధత కొనసాగుతోంది. సీఎంగా  ఉంటూ  గనుల లీజుని సోరెన్.. తనకు తానే  కేటాయించుకోవడం  వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని  సెక్షన్-9ఏకు  విరుద్ధమని బీజేపీ.. రాజ్ భవన్ కు  ఫిర్యాదు చేసింది. దీనిపై  గవర్నర్ రమేశ్ బాయిస్.. ఈసీ  అభిప్రాయాన్ని కోరారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని.. ఈనెల 25న  సీల్డ్ కవర్ లో  పంపింది. ఇందులో సోరెన్ పై  అనర్హత వేటు  వాయలని  ఈసీ సిఫార్సు చేసినట్లు సమాచారం.  అయితే  మళ్లీ ఎన్నికల్లో సోరెన్ పోటీ చేసేందుకు  అభ్యంతరం తెలపలేదని తెలుస్తోంది. దీనిపై ఇవాళ  గవర్నర్ నిర్ణయం  తీసుకునే అవకాశం ఉంది.

హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా సహా  సంకీర్ణ ప్రభుత్వంలో  భాగమైన..కాంగ్రెస్,  ఇతర పార్టీలు వరుస సమావేశాలు  నిర్వహించాయి. బీజేపీ  నుంచి తమ ఎమ్మెల్యేలను  కాపాడుకోవటానికి ప్రణాళికలను ఇందులో చర్చించినట్లు  తెలుస్తోంది. ఊహించని  సంక్షోభం  తలెత్తితే ఎమ్మెల్యేలను  బిహార్, బెంగాల్,  ఛత్తీస్ గఢ్ లోని రిసార్టులకు పంపే  అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోరెన్ శాసన సభ్యత్వంపై  అనర్హత వేటు  వేస్తే. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు  సోరెన్ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు  కొందరు ప్రయత్నిస్తున్నారని..  తన చివరి రక్తపు  బొట్టు ఉన్నంతవరకు  వారిపై  పోరాడుతామని  హేమంత్ సోరెన్ అన్నారు.