నేనెక్కడికి పారిపోలేదు.. ఈడీకి జార్ఖండ్ సీఎం లేఖ

నేనెక్కడికి పారిపోలేదు..  ఈడీకి జార్ఖండ్ సీఎం లేఖ

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీకి లేఖ రాశారు. తాను ఎక్కడికి పారిపోలేదని..   2024 ఫిబ్రవరి 2వ తేదీ నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని.. సీఎంగా తాను బడ్జెట్‌ కసరత్తుపై బిజీగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో  జనవరి 31లోపు విచారణకు రావాలని ఎలా ఒత్తిడి చేస్తారని ఈడీని   హేమంత్ సోరెన్ ప్రశ్నించారు.  దీన్ని బట్టి మీ దుర్భుద్ది ఏంటో అర్థమవుతోందని... మీ చర్యలు హానికరమైనవి, రాజకీయంగా ప్రేరేపితమైనవి- అని లేఖలో  తెలిపారు.   భూకుంభ కోణం కేసుతో పాటుగా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న  సీఎం  హేమంత్ సోరెన్ కు ఇప్పటికే పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది.  అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా దాటవేస్తూ వచ్చారు  హేమంత్ సోరెన్.  

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను విచారించేందుకు ఈడీ అధికారులు 2024 జనవరి 29వ తేదీ  సోమవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే సీఎం సోరెన్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సీఎం హేమంత్ కావాలనే విచారణకు రావడంలేదని ఈడీ తెలిపింది.  సోరెన్  కుటుంబ సభ్యులు మాత్రం వ్యక్తిగత పనిమీద వెళ్లారంటున్నారు.  దీంతో అక్రమంగా కొన్నట్లు భావిస్తున్న బీఎండబ్ల్యూ కారును, కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా ఈడీ ఇప్పటివరకూ 7 సార్లు సమన్లు జారీ చేయగా, సోరెన్ విచారణకు హాజరుకాలేదు.  మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 24  గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది.