50 శాతం పెరిగిన జీతాలు.. సీఎం, మంత్రుల వేతనాలు ఎంతంటే?

50 శాతం పెరిగిన జీతాలు.. సీఎం, మంత్రుల వేతనాలు ఎంతంటే?

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 50 శాతం వరకు పెంచేందుకు చంపై సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో సోరెన్ ఇంక్రిమెంట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. శాసనసభ్యులు గరిష్టంగా 50 శాతం జీతాల పెంపును పొందుతారు. సీఎంజీతాన్ని 25 శాతం పెంచగా, ఆయన మంత్రులకు 31 శాతం జీతం పెరగనుంది.  శాసనసభ్యులు, మంత్రులు, స్పీకర్, ప్రతిపక్ష నేత, సీఎం, అసెంబ్లీ అధికారుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రోత్సాహకాల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఇంక్రిమెంట్ ఆమోదంతో సీఎం బేసిక్ జీతం నెలకు రూ.80,000 నుంచి రూ.లక్షకు, మంత్రుల వేతనాలు రూ.65 వేల నుంచి రూ.85 వేలకు, శాసనసభ్యుల వేతనం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెరగనుంది. స్పీకర్ బేసిక్ జీతం రూ.78 వేల నుంచి రూ.98 వేలకు, ప్రతిపక్ష నేత రూ.65 వేల నుంచి రూ.85 వేలకు, చీఫ్ విప్ రూ.55 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. 

సీఎం, మంత్రులు, స్పీకర్‌, ప్రతిపక్ష నేత, చీఫ్‌ విప్‌, విప్‌ల వేతనాలు, ప్రోత్సాహకాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సీఎంకు 25 శాతం, ఇతర మంత్రులకు 31 శాతం జీతాలు పెంచాలని సిఫారసు చేస్తూ 2023 డిసెంబర్‌లో కమిటీ నివేదిక సమర్పించింది.