సుప్రీం తీర్పు జర్నలిస్టులకు దారులు మూసివేయలేదు

సుప్రీం తీర్పు జర్నలిస్టులకు దారులు మూసివేయలేదు
  • కొన్ని నిబంధనలతో ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చు  
  • ఇండ్ల స్థలాలపై సమావేశంలో న్యాయ నిపుణులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్‌‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (జేఎన్‌‌జేహెచ్‌‌ఎస్) సభ్యులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా ఇండ్ల స్థలాలు కేటాయించే అవకాశం ప్రభుత్వానికి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. సంక్షేమ రంగాల్లో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉందని, జర్నలిస్టుల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.  టీం జేఎన్​జే ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్​లో జరిగిన ‘ఇండ్ల స్థలాలు-మార్గదర్శనం’ సమావేశంలో హైకోర్టు మాజీ జడ్జిలు జస్టిస్ పి.ఎస్.నారాయణ, జస్టిస్ బి. చంద్రకుమార్, సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. 

జస్టిస్ నారాయణ మాట్లాడుతూ.. సుప్రీం తీర్పు జర్నలిస్టులకు దారులు మూసివేయలేదని, నిబంధనల మేరకు స్థలాలు ఇవ్వవచ్చని అన్నారు. రాజ్యాంగంలో గృహనివాసం ప్రాథమిక హక్కుగా ఉందని, జర్నలిస్టులను ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలతో పోల్చకుండా వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించాలని సూచించారు. సుప్రీం సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, వేదుల వెంకటరమణ ఇచ్చిన లీగల్ ఒపీనియన్లు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. 

పేట్ బషీరాబాద్, నిజాంపేటలో 20 ఏండ్ల క్రితం కేటాయించిన స్థలాలు స్వాధీనం చేసుకోవడానికి కోర్టులు అవకాశం కల్పిస్తాయని వివరించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ పిల్లర్​గా ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎలైట్ గ్రూపుతో సమానంగా లేరని, అసమానతలను ప్రభుత్వం పరిగణించాలన్నారు. గత 20 ఏండ్లలో 80 మంది సభ్యులు చనిపోయారని, సుప్రీం తీర్పును బూచీగా చూడకుండా మార్గదర్శకాల ప్రకారం స్థలాలు ఇవ్వవచ్చని సూచించారు. 

ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ అందరు జర్నలిస్టులకు ఒకే న్యాయం వర్తింపజేయాలని, మూడు దఫాలుగా కొంతమందికి స్థలాలు ఇస్తే జేఎన్‌‌జేహెచ్‌‌ఎస్ సభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చినట్లే హైదరాబాద్​లోనూ ఇవ్వాలని కోరారు. సొసైటీ డైరెక్టర్లు పీవీ రమణారావు, కొండం అశోక్‌‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు 
పాల్గొన్నారు.