ప్రిన్సిపల్ ఛాంబర్‭కు పోస్టర్ అంటించిన జేఎన్టీయూ విద్యార్థులు

ప్రిన్సిపల్ ఛాంబర్‭కు పోస్టర్ అంటించిన జేఎన్టీయూ విద్యార్థులు

కూకట్‭పల్లి జేఎన్టీయూలో విద్యార్థులు, ప్రిన్సిపల్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రిన్సిపల్ అసత్యాలు మాట్లాడుతున్నారంటూ విద్యార్థులు పోస్టర్ తయారుచేశారు. ప్రిన్సిపల్ జయలక్ష్మీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ... ఆమె ఛాంబర్ డోర్‭కు పోస్టర్ అంటించారు. హాస్టల్స్‭లో సరైన సౌకర్యాలు లేవంటూ.. గత రెండు రోజులుగా జేఎన్టీయూ క్యాంపస్‭లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే విద్యార్థులు కావాలనే ఆందోళన చేస్తున్నారని ప్రిన్సిపల్ ఆరోపించారు. హాస్టల్స్‭లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరింది. 

ప్రిన్సిపల్ చెప్పేవన్నీ అబద్ధాలే : విద్యార్థులు

ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చొని అబద్ధాలు ప్రచారం చేయటం సమంజసమేనా అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. అసలు జయలక్ష్మీ ఎన్నిసార్లు వసతి గృహలను సందర్శించారో సీసీ కెమెరా ఫుటేజ్‭లను బయట పెట్టగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాని క్యాంపస్‭లోకి పిలుచుకోవటానికి తాము ప్రిన్సిపల్ అనుమతులు తీసుకోవాలా అని మండిపడ్డారు. ఎంతమంది నాన్ బోర్డర్స్‭ని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారో, ఆ నివేదికను బహిర్గతం చేయగలరా అని ప్రశ్నించారు. అపాయింట్మెంట్ లేకుండా రోజూ ఎంతమంది విద్యార్థులను కలుస్తున్నారో బయట పెట్టాలన్నారు. వసతి గృహాల్లో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అంటూ ప్రశ్నలు సంధిస్తూ విద్యార్థులు పోస్టర్‭ను ఆవిష్కరించారు. విద్యార్థుల తీరుపై జేఎన్టీయూ యాజమాన్యం ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులు తమ ఆందోళనను ఉదృతం చేసే అవకాశం ఉంది.